పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు
● అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్
అధికారి వెంకటేశ్వరరావు
నెల్లూరు(బారకాసు): పాలు, పాల పదార్థాలను కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం నెలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుడ్స్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాగుంట లేఅవుట్, బాలాజీ నగర్, దర్గామిట్ట, బీవీ నగర్‌లో ఉన్న పాల డెయిరీలను పరిశీలించారు. ప్రజలకు విక్రయిస్తున్న పాలు, పెరుగు, నెయ్యి, కోవా, పనీర్ మొదలైన వాటి నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపించారు. నివేదికలను అనుసరించి ఏవైనా కల్తీ పదార్థాలున్నట్లు, లేదా తగిన నాణ్యతా ప్రమాణాలు లేవని నిర్ధారణ అయితే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుద్ధి పరీక్షల్లో సబ్ స్టాండర్డ్ నివేదిక వచ్చిన పక్షంలో జేసీ సంబంధిత వ్యాపారిపై రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. అలాగే శుద్ధి నమూనాలు ఆరోగ్యానికి హానికరమని లేదా సురక్షిత ఆహారం కాదని నివేదిక వస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీంతో న్యాయస్థానం ఏడు సంవత్సరాల వరకు కారాగార శిక్షతోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని రైతుల నుంచి పాలు సేకరించే ఏజెంట్లు, చిల్లింగ్ సెంటర్లు, డెయిరీలు ఇతర వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీకి పాల్పడకుండా, స్వచ్ఛమైన పాలను విక్రయించాలన్నారు. అదేవిధంగా ప్రతి వ్యాపారి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషను తప్పనిసరిగా పొంది ఉండాలన్నారు. తనిఖీలు నిరంతరంగా కొనసాగుతుంటాయని తెలియజేశారు.


