యూరియా కోసం ఆందోళన అవసరం లేదు
● వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి
ఉదయగిరి: జిల్లాలో వివిధ పైర్లు సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగినంత నిల్వలున్నాయని జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణి తెలిపారు. మండలంలోని తిరుమలాపురం పంచాయతీ గుడినరవ గ్రామ రైతులు యూరియా అందడం లేదని శనివారం ఉదయగిరి వ్యవసా య కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆమె గుడినరవకు చేరుకుని రైతులతో మాట్లాడుతూ కొట్టాలపల్లి సొసైటీలో యూరి యా పంపిణీ చేస్తున్నామని, సోమవారం మరో 18 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. గుడినరవ రైతు సేవా కేంద్రానికి సోమవారం 18 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామన్నారు. ఏడీఏలు నర్సోజిరావు, చెన్నారెడ్డి ఉన్నారు.
విద్యార్థి మృతి కేసులో ఇద్దరు
ప్రైవేట్ టీచర్లకు ఐదేళ్ల జైలు
అల్లూరు: పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడ్డాడని విద్యార్థిని చితకబాది, అతని మృతికి కారణమైన ఇద్దరు ప్రైవేట్ టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కావలి సివిల్ జడ్జి గీతావాణి తీర్పును వెల్లడించారు. వివరాల్లోకెళ్తే కావలి వైకుంఠపురంలోని చేవూరివారి తోటలో శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో వెంకటసాయికృష్ణ (12) అనే విద్యార్థి 2014లో ఐదో తరగతి చదువుతున్న తరుణంలో పరీక్షల్లో కాపీ కొడుతున్నారంటూ ఉపాధ్యాయిని కె కౌసల్య, ప్రధానోపాధ్యాయుడు మంద అయ్యన్న విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అంతర్గంతంగా తీవ్రగాయాలతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి చిన్నయ్య అప్పటి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై సయ్యద్ ఉస్మాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ మేరకు నిందితులపై నేరం నిరూపితం కావడంతో ఐదేళ్ల జైలుతోపాటు, రూ. 50 వేల చొప్పున జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ రామకృష్ణ కేసును వాదించారు.
బాలికపై
లైంగికదాడికి యత్నం
చిల్లకూరు: 12 ఏళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించినట్లు చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గూడూరు ఒకటో పట్టణ ఎస్సై మనోజ్‌కుమార్ శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. శుక్రవారం పట్టణంలోని ఓ వార్డుకు చెందిన చిన్నారి ఇంట్లో ఉండగా అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు ఇంట్లోకి దూరి లైంగికదాడికి యత్నించాడు. దీంతో చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమిగూడేసరికి యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


