మెడికల్ షాపులో యువకుల విధ్వంసం
● జర్నలిస్టు, ఆయన కుటుంబ సభ్యులపై దౌర్జన్యం
● డీఎస్పీ విచారణ
దగదర్తి: ఓ పత్రిక జర్నలిస్టు భార్య నిర్వహిస్తున్న మెడికల్ షాపులో కొందరు అల్లరి మూకలు విధ్వంసం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసిన ఘటన దగదర్తిలో శుక్రవారం సా యంత్రం జరిగింది. బాధితుల సమాచారం మేరకు.. దగదర్తిలోని తడక లూరు రోడ్డులో ఓ పత్రిక విలేఖరి షేక్ మస్తాన్ భార్య మస్తాన్‌బీ ఫార్మసిస్ట్‌గా ఎంఎస్ మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన యువకులు పైడి తరుణ్, మొలతాటి పవన్‌కళ్యాణ్, వంశీ క్రికెట్ ఆడుతుండగా, వంశీకి గాయమైందని చికిత్స చేయమని అడిగారు. చికిత్స చేసేందుకు తగిన పరికరాలు తన వద్ద లేవని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న వారు.. చికిత్స చేయమని అడిగితే లేదంటావా నీ సంగతి చూస్తా నీ షాపు లేకుండా చేస్తానంటూ దుర్భాషలాడి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఆమె భయపడి తన భర్త మస్తాన్‌కు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అతను అక్కడికి చేరుకొని వారిని సర్దుబాటు చేసి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే కొద్ది సేపటికి పవన్ కళ్యాణ్, మోడే సుమంత్, కాకి వెంకటేష్ మరో కొంతమంది యువకులతో మెడికల్ షాపు వద్దకు వచ్చి దౌర్జన్యం చేస్తూ బయటకి రమ్మని అంతు చూస్తామంటూ మస్తాన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేశారు. ఇంటి వద్దకు వెళ్లి అక్కడ ఉన్న మస్తాన్ కుమారుడిని బెదిరించి షాపులో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై మస్తాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వివిధ సామాజిక మాధ్యమాల్లో కథనాలు రావడంతో శనివారం కావలి డీఎస్పీ శ్రీధర్ దగదర్తికుని చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతోపాటు బాధితులను విచారించారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కొంత మంది యువకులు మెడికల్ షాప్ వద్ద దౌర్జన్యం చేసి దూషించడం వాస్తవమేనని తెలిపారు. వారిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, మరింత లోతుగా విచారణ చేపట్టి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ వెంట కావలి రూరల్ సీఐ పాపారావు, టూటౌన్ సీఐ గిరిబాబు, దగదర్తి, బిట్రగుంట, జలదంకి ఎస్‌ఐలు జంపానికుమార్, ప్రభాకర్, లతీఫ్‌ఫున్నీసా తదితరులు పాల్గొన్నారు.


