మరో బాలుడి మృతదేహం లభ్యం
అల్లూరు: మండలంలోని ఇస్కపల్లి సముద్ర తీరంలో గల్లంతైన బాలుడు జి. సుధీర్ (15) మృతదేహం శనివారం ఉదయం తీరానికి కొట్టుకువచ్చింది. శుక్రవారం పండగ పూట సరదాగా గడిపేందుకు వెళ్లి నలుగురు బాలలు గల్లంతైన విషాదఘటన తెలిసిందే. అప్పుడే అన్నాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడగా, మరో ఇద్దరి ఆచూకీ దొరకలేదు. దీంతో ఘటన జరిగినప్పటి నుంచి ఎస్సై శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులతో పాటు గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం మృతదేహం తీరానికి కొట్టుకురావడంతో పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో బాలుడు కె అభిషేక్ ఆచూకీ తెలియరాలేదు. అతని కోసం గాలిస్తునట్లు ఎస్సై తెలిపారు.


