వస్త్ర దుకాణంలో భారీ చోరీ
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని రాజావీధిలో గల ఓ వస్త్ర దుకాణంలో భారీ చోరీ గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గూడూరు ఒకటో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. రాజావీధిలోని ఓ వస్త్ర దుకాణంలోకి వెనుక వైపు నుంచి ఓ దుండగుడు దూరాడు. ముందు రోజు విక్రయాలకు సంబంధించిన నగదును గల్లా పెట్టెలో యజమాని ఉంచి వెళ్లారు. ఈ క్రమంలో దాన్ని దుండగుడు పగలగొట్టి అందులో ఉన్న రూ.నాలుగు లక్షలను చోరీ చేశాడు. దుకాణానికి ఉదయం వచ్చిన యజమాని.. చోరీ విషయాన్ని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకొని వివరాలను పోలీసులు సేకరించారు. సీసీ టీవీని పరిశీలించగా, అందులో చోరీ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఈ దిశగా విచారణ జరుపుతున్నారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది. చోరీలో ఎంత మంది పాత్ర ఉందనే విషయాలను త్వరలోనే తెలియజేసి, కేసును ఛేదిస్తామని తెలిపారు.


