మెడికల్ కళాశాలల పీపీపీ విధానం నారా కుటుంబానికే లబ్ధి
● మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నారా కుటుంబానికి వాటాలు కోసమేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని మునులపూడి పంచాయతీలోని రెడ్డిపాళెంలో మంగళవారం మెడికల్ కళాశాలల పీపీపీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసన్న మాట్లాడుతూ పీపీపీ విధానంతో చంద్రబాబు, తనయుడు లోకేశ్‌కే లబ్ధి చేకూరుతుందన్నారు. నెల్లూరులోని నారాయణ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఇప్పటికే నారా భువనేశ్వరికి వాటాలున్నాయని గుర్తు చేశారు. అందుకే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానానికి మొగ్గు చూపుతోందన్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన, నిర్మిస్తున్న 17 మెడికల్ కళాశాలల్లో నారా కుటుంబానికి వాటాలా కోసమే ఈ ప్రైవేటీకరణ జపమన్నారు. అందువల్లే పీపీపీ విధానానికి చంద్రబాబు ఆమోదం తెలిపారన్నారు. వైస్సార్‌సీపీ ప్రభుత్వలో విలేజ్ క్లినిక్‌ల పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు కార్పొరేట్ వైద్యం అందిస్తే.. ప్రస్తుత ప్రభుతం అందుకు విరుద్ధంగా పేద ప్రజలకు వైద్యంతోపాటు విద్యను కూడా అందని ద్రాక్షగా మిగిల్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆమోదం పొందిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడం దుర్మార్గ చర్య అన్నారు. పీహెచ్‌సీ డాక్టర్లు 24 రోజుల సమ్మె చేస్తే వారి డిమాండ్లు పట్టించుకోకపోగా, వారిని భయపెట్టి విధుల్లో చేర్చారని గుర్తు చేశారు. ఈ రోజు వరకు సుమారు రూ.3 వేల కోట్లు వివిధ ఆస్పత్రులకు బకాయిలు ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని చెల్లించకపోవడం పేదలను మరింత కష్టాల్లోకి నెట్టడమేనన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు సమగ్రమైన, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లోని ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించి వైద్యం అందించడం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండూరు అనిల్‌బాబు, వీరి చలపతిరావు, విజయ్‌కుమార్, సతీష్‌రెడ్డి, షాహుల్, సీనియర్ వైఎస్సార్‌సీపీ నాయకుడు కోడూరు మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


