ఎఫ్‌పీఓలు క్రియాశీలకంగా పని చేయాలి
● రైతులకు విత్తనాలు, ఎరువులు అందించాలి
● డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి
నెల్లూరు (పొగతోట): ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి ఏపీఎంలు, సీసీలను ఆదేశించారు. మంగళవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. రైతులకు సంబంధించి 37 మండలాల్లో ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేశామన్నారు. 4391 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెల గ్రూపు మీటింగ్‌లు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఎఫ్‌పీఓల్లో ఉన్న రైతులందరికీ వ్యవసాయశాఖ అధికారుల సహాయంతో వారికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందించాలని తెలిపారు. మండలంలో యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా వ్యవసా య ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన సహాయ సహాకారాలు అందించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏజీఎం కామక్షయ్య, డీపీఎం మధుసూదన్, ఏపీఎంలు, సీసీ (ఎఫ్‌పీఓ)లు పాల్గొన్నారు.


