సర్వేపల్లిలో సోమిరెడ్డి పోటీ చేసే ప్రసక్తే లేదు
ముత్తుకూరు(పొదలకూరు): వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి సర్వేపల్లిలో పోటీ చేసే ప్రసక్తే లేదని, కనుకనే సర్వం దోచుకుని దాచుకుంటున్నాడని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో మంగళవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సర్వేపల్లిలో ఎవరిని కదిలించినా.. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అరాచకం మితిమీరిందని వాపోతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బూడిద బల్కర్ల వద్ద టీడీపీ రౌడీలు నగదు వసూలు చేయడం ఎన్నడైనా చూశామని ప్రశ్నించారు. పామాయిల్ ట్యాంకర్ల వద్ద దోచుకుంటున్నారని, థర్మల్ విద్యుత్ కేంద్రం వాళ్లు తుఫాను సమయంలో దుప్పట్లు పంపిణీ చేసి, భోజనాలు పెడితే దాన్ని సోమిరెడ్డి ఖాతాల్లో వేసుకున్నట్లు తెలిపారు. సర్వేపల్లి రిజర్వాయర్, కండలేరు స్పిల్‌వే కాలువ పనులను ఎఫ్‌డీఆర్‌లో చేపట్టి అప్పణంగా దోచుకునేందుకు స్కెచ్ వేసినట్లు దుయ్యబట్టారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటామని ప్రజలకు ఆపద వస్తే వారి తరఫున పోరాటం చేసి మళ్లీ జైలుకు వెళ్లేందుకై నా సిద్ధంగా ఉన్నానన్నారు. రైతులకు అవసరమైన యూరియా ఎక్కడైనా ఇవ్వకున్నా, టీడీపీ నేతలు జోక్యం ఉన్నా.. తమకు సమాచారం ఇస్తే ఆందోళన చేపడుతామని రైతులకు భరోసా ఇచ్చారు.


