ఎమ్మెల్యే ట్రాన్స్‌పోర్టు మాఫియాను అరికట్టాలి
నెల్లూరురూరల్: కృష్ణపట్నం పోర్టులో సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరుల ట్రాన్స్‌పోర్టు మాఫియాను అరికట్టాలని తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగానంద్ డిమాండ్ చేశారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ట్యాంకర్లకు రూ.300, కర్ణాటక, తమిళనాడు ఆయిల్ ట్యాంకర్లకు రూ.7 వేలు వంతున వసూలు చేస్తున్నారన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి రోజు 150 ఆయిల్ లోడులు వెళ్తున్నాయన్నారు. ఈ లెక్కన సుమారు రూ.65 లక్షలు ఎవరి ఖాతాకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులు ఉమాపతి పెంచలరెడ్డి ఈ తరహా కొత్త వ్యాపారం జోరుగా సాగిస్తున్నారన్నారు. తమ షాపునకు మూడు లారీలతో రవాణా చేస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు తమ లారీ ఒకటి బాడుగ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని, అది ఆయన రూల్ అంటా, దానిని తప్పకుండా పాటించాలని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. మా లారీతో తోలుకుంటే రూ.10 వేలు ఖర్చుతో సరిపోతుంది. ఎమ్మెల్యే లారీ పెడితే తమకు సుమారు రూ.30 వేల నష్టం వస్తుందని, అలా ఒప్పుకోకపోతే మా లారీలను కృష్ణపట్నం పోర్టులో తిరగకుండా ఆపేస్తామని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. అందుకు ఒప్పుకోలేదని శనివారం నుంచి ఒక లారీని ఆపేశారని వివరించారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని ఈ ట్రాన్స్‌పోర్టు మాఫియా ను అరికట్టాలని యోగానంద్ కోరారు.


