
ఆహా.. కట్టుకథలు చూడండి
అర్ధరాత్రి గిరిజన మహిళల అరెస్ట్
మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్టు
విస్తుపోతున్న ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు
కూటమి ప్రభుత్వంలో పావులుగా పోలీసులు
ఉలవపాడు: కూటమి ప్రభుత్వంలో పోలీసులు పాలకులు చెప్పినట్లుగా తలూపుతూ జీ హుజూర్ అంటున్నారు. ఈనెల 25వ తేదీ అర్ధరాత్రి గిరిజన మహిళలను అరెస్ట్ చేసి తీసుకొచ్చారని వందలాది మంది స్టేషన్ ముందు ధర్నా చేస్తే.. పోలీసులు మాత్రం తాపీగా 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో చూపించడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అర్ధరాత్రి అరెస్ట్‌లు దారుణమని ఖండించిన తర్వాత కూడా సమయం మార్చి చూపించడమంటే కోర్టును తప్పుదోవపట్టించడమే కదా అనే అనుమానం కలగక మానదు.
రిమాండ్ రిపోర్టులో ఇలా..
ఈనెల 25వ తేదీ కరేడు పంచాయతీ రామకృష్ణాపురంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావు, రైతు ఉద్యమ నాయకుడు మిరియం శ్రీను, ఉపాధ్యాయు డు కేశవరపు జాలిరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఇండోసోల్ ప్రాజెక్ట్ భూములకు వ్యతిరేకంగా వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి శేషమ్మ అనే మహిళ వెళ్లలేదు. ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్లడానికి సిద్ధంగా ఉందని రిపోర్టులో రాశారు. నేతల సమావేశం పూర్తై వెళ్లిన తర్వాత శేషమ్మ గ్రామంలోని కల్పన కూల్‌డ్రింక్ షాపు వద్ద ఉన్న సమయంలో ముగ్గురు మహిళలు వెళ్లి గొడవ చేసి గాయపరిచినట్లు పొందుపరిచారు. ఈ విషయమై శేషమ్మ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అదేరోజు రాత్రి 10 గంటలకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం వైద్యాధికారికి ఫిర్యాదును పంపించారు. ఎస్సై అంకమ్మ అదేరోజు రాత్రి రామకృష్ణాపురంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడి చేశారని చెబుతున్న గిరిజన మహిళలకు నోటీసులు అందించి స్టేషన్‌కు తిరిగొచ్చారు. సదరు మహిళలు స్టేషన్‌కు వచ్చారు. అయితే వారు ఎన్ని గంటలకు వచ్చారనే సమయాన్ని రిపోర్టులో చేర్చలే దు. 26వ తేదీన వైద్యాధికారి శేషమ్మకు గా యాలు అధికంగా ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో మెమో దాఖలు చేశారు. సదరు మహిళల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే మరికొందరిపై దాడి చేసే పరిస్థితి ఉందని రిపోర్టులో వెల్లడించారు. ముగ్గురు గిరిజన మహిళల్ని ఏ1, ఏ2, ఏ3గా పెట్టి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్ వద్దే అరెస్ట్ చేసినట్లు చూపించారు. మహిళా పోలీసుల సమక్షంలో 13.15 నిమిషాలకు కోర్టుకు హాజరుపరుస్తూ పూర్తి విచారణ చేసేందుకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని ఎస్సై అంకమ్మ కోర్టుకు విన్నవించినట్లు రిపోర్టులో ఉంది. దీనిపై ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు.