● ప్రభుత్వ నిధులతో మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద సీసీ రోడ్డు నిర్మాణం
ఆత్మకూరురూరల్: మండలంలోని నారంపేటలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు ఇంటి వద్ద రూ.2 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు చర్చనీయాంశంగా మారింది. ఆ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామస్తులకు ఎలాంటి ఉపయోగం లేకపోగా కనీసం ఆయనకు కూడా ఎలాంటి ఉపయోగం లేదని స్థానికులు అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంటికి ఎదురుగా 67వ నంబరు జాతీయ రహదారి నుంచి ఆత్మకూరు, మహిమలూరులను కలుపుతూ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపట్టింది. అప్పట్లో నిర్మించిన భవనం బేస్‌మెంట్ కంటే నూతన రోడ్డు నిర్మాణం రెండు, మూడు అడుగులు ఎత్తులో వెళ్లింది. దీంతో తన ఇంటి ప్రహరీ గోడకు ఎదురుగా ఇటీవల ప్రభుత్వ నిధులతో ఎవరికి ఉపయోగంలేని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సిమెంటు రోడ్డు మీదనే మండల పరిషత్ నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని రేపో, మాపో పనులు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.


