‘పది’ మూల్యాంకనం ప్రారంభం
● విధులకు ఎగనామం పెట్టిన కొందరు టీచర్లు
నెల్లూరు(టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్, బాలుర ఉన్నత పాఠశాలల్లో దీనిని చేపట్టారు. తొలిరోజు మూల్యాంకనంలో 612 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 103 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 190 మంది స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తొలిరోజు 12,984 జవాబుపత్రాలను దిద్దారు. ఇదిలా ఉండగా మెజార్టీ శాతం ఉపాధ్యాయులు మూల్యాంకనానికి డుమ్మా కొట్టారు. 1,076 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గానూ 612 మంది మాత్రమే హాజరయ్యారు. 174 మంది చీఫ్ ఎగ్జామినర్లకు గానూ 103 మంది, 348 మంది స్పెషల్ ఆఫీసర్లకు గానూ 190 మంది వచ్చారు. మూల్యాంకనానికి సరిపడా టీచర్లను మాత్రమే తీసుకుని మిగిలిన వారిని రిజర్వ్‌లో పెట్టామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి దీని నుంచి తప్పించుకునేందుకు కొందరు టీచర్లు యూనియర్లు, రాజకీయ నాయకుల ద్వారా డీఈఓపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో చేసేదేమీ లేక వచ్చిన వారితోనే జవాబుపత్రాలను దిద్దించారని ప్రచారం జరుగుతోంది.


