200 బస్తాల
రేషన్ బియ్యం పట్టివేత
● రీసైక్లింగ్ చేసి మేలి రకం
బియ్యంలో కలిపి విక్రయం
కొడవలూరు: కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి రైస్ మిల్లులో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. వాటిని రీసైక్లింగ్ చేసి మేలి రకం బియ్యంలో కలిపి విక్రయిస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో కోవూరు, ఆత్మకూరు సీఎస్ డీటీలు బాల కోటమ్మ, అజీజ్‌లు గురువారం రైస్ మిల్లుపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. రైస్‌మిల్లులో సుమారు 200 బస్తాల రేషన్ బియ్యం ఉండగా, ఇందులో 30 బస్తాలు రేషన్ షాపులకొచ్చే బస్తాల్లోనే ఉన్నాయి. మిగిలినవి రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ గోతాల్లో నింపి ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం బస్తాలను సీజ్ చేసి పౌరసరఫరాల శాఖ గిడ్డంగికి తరలించారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీటీ బాలకోటమ్మ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆర్‌ఐ సునీల్ కుమార్‌రెడ్డి, వీఆర్వో సురేష్ పాల్గొన్నారు. ఇక్కడి రైస్ మిల్లును ఒంగోలు చెందిన వ్యక్తికి లీజుకిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి కేవలం రేషన్ బియ్యం రీసైక్లింగ్ మినహా ధాన్యం ఆడించడం చేయడం లేదని అధికారులు నిర్ధారించారు. గతంలో కూడా ఈ రైస్ మిల్లులో రేషన్ బియ్యం పట్టుబడింది. నిందితుల పట్ల కఠిన చట్టాలు అమలు చేయకపోతుండడంతో యథావిధిగా ఈ వ్యాపారం కొనుసాగిస్తూ రూ.లక్షలు జేబుల్లో వేసుకొంటున్నారు.
200 బస్తాల


