మత్తులో కాలువలో పడి ఒకరు
అతిగా సేవించి మరొకరు
కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. కావలి నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
కావలి: కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో కావలి – పెద్దపవని రోడ్డులో జలదంకి మండలం లింగరాజు అగ్రహారం గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద ఇటీవల మద్యం షాపు ఏర్పాటు చేశారు. లింగరాజు అగ్రహారం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (60) అనే దళితుడు మంగళవారం ఆ షాపులో మద్యం తాగి తన టీవీఎస్ మోపెడ్‌పై గ్రామానికి బయలుదేరాడు.
ఈ క్రమంలో కావలి కాలువపై పిట్టగోడ లేని కల్వర్టు వద్ద వాహనం అదుపు తప్పింది. దీంతో రమణయ్య కాలువలో పడిపోయాడు. అటుగా వెళ్తున్న రైతులు గమనించి కాలువలో దిగి పైకి లేపగా అప్పటికే రమణయ్య మరణించినట్లు గుర్తించారు. మూగజీవాలు మేపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి గ్రామానికి సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపు వల్ల ప్రాణాలు కోల్పోయాడని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతిగా తాగి..
అల్లూరు: అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అల్లూరు క్రిస్టియన్‌పేట కాలనీలో మంగళవారం జరిగింది. ఎస్సై కిశోర్‌బాబు కథనం మేరకు.. వాకాడు మండలం నిమ్మవారితిప్ప గ్రామానికి చెందిన దండిపూడి వెంకటేష్ (27), భార్య పావనితో కలి సంవత్సర కాలంగా అల్లూరు క్రిస్టియన్‌పేటలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనులు చేస్తుంటారు. సోమవారం పావని తన బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం ఉదయం నుంచి వెంకటేష్‌కు అతడి అన్న మోషే ఫోన్ చేస్తున్నాడు.
రిసీవ్ చేయకపోవడంతో అమర్ అనే వ్యక్తిని ఇంటికి పంపి చూడగా వెంకటేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని మోషేకు చెప్పడంతో అతను వచ్చి చూసి చనిపోయినట్లు గుర్తించి అల్లూరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడం ఇచ్చారు. మృతుడి పక్కన మద్యం బాటిళ్లు ఉన్నాయి. వెంకటేష్ అతిగా మద్యం తాగి చనిపోయి ఉండొచ్చని అతడి అన్న పోలీసుకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


