● కలెక్టరేట్ ఏఓ, జిల్లా కో ఆర్డినేటర్‌కు వినతిపత్రాల అందజేత
నెల్లూరు (అర్బన్): ఎన్‌టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా రోగులకు చికిత్సలు అందించినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ఏప్రిల్ 7వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంపానెల్ కలిగిన ప్రైవేట్, కార్పొరేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు బంద్ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, అరవింద్ కిడ్నీ ఆస్పత్రి అధినేత డాక్టర్ డాక్టర్ ఎస్‌వీఎల్ నారాయణరావు ప్రకటించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌లో పరిపాలనాధికారి విజయకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఎన్‌టీఆర్ వైద్యసేవ కింద సుమారు రూ.3,500 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలున్నాయన్నారు. ఆ నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హాస్పిటల్స్ నిర్వహణ అత్యంత భారంగా మారిందన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వైద్యసేవలు బంద్ గురించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ మురళీశంకర్‌రెడ్డి, డాక్టర్ హజరత్‌కుమార్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ జీఎల్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ
నెల్లూరు (బారకాసు): మల్టీ ఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌ల్లో వాహన పార్కింగ్ ఫీజులను ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వస్తున్నట్లు కమిషనర్ సూర్యతేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మల్టీ ఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ పూర్తిగా ఉచితమని తెలిపారు. 30 నిమిషాల నుంచి గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు మల్టీ ఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌లో ఏదైనా వస్తువు కొన్నట్లుగా బిల్లు చూపిస్తే అలాంటి వారికి ఫీజులు వర్తించవని వెల్లడించారు. బిల్లు చూపించకపోతే అలాంటి వారి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయొచ్చని స్పష్టం చేశారు. గంటకుపైగా పార్కింగ్ చేసిన వాహన చోదకులు సినిమా టికెట్, ఇతరత్రా బిల్లులు చూపినట్లయితే ఉచితమని, ఆధారం చూపని వారి నుంచి ఫీజులు వసూలు చేయొచ్చన్నారు.


