వన్యప్రాణుల గొంతెండుతోంది
●
నీటిని నింపుతున్నాం
పెంచల నరసింహా వైల్డ్ లైఫ్ ప్రాంతంలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తున్నాం. 400 తొ ట్టెల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. వన్యప్రాణులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మిగతా రేంజ్ పరిధిలో నీటి తొట్టెల్లేవు. ఆ ప్రాంతంలో వాననీరు కుంటల్లో నిల్వ ఉండేలా ప్రయత్నం చేశాం. అటవీ ప్రాంతంలో ఉండే జంతువులు, అరుదైన వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అటవీ ప్రాంతంలో గడ్డికి నిప్పు అంటించడం నేరం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. – మహబూబ్‌బాషా,
జిల్లా అటవీ శాఖాధికారి
వేసవి తాపం పెరిగిపోయింది. గతేడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మండుతున్న ఎండలతో వన్యప్రాణులు జీవన్మరణ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడవిలో సహజ సిద్ధంగా ఉండే కుంటల్లో నీటి నిల్వలు లేక దాహార్తి తీర్చుకునేందుకు ప్రాణులు గ్రామాల వైపు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. వేసవి దృష్ట్యా అటవీ శాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
ఉదయగిరి: జిల్లాలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ వన్యప్రాణులకు నిలయం. ముఖ్యంగా పెంచలకోన, ఆత్మకూరు, ఉదయగిరి అటవీ ప్రాంతాల్లో అరుదైన జంతు, వృక్ష సంపద ఉంది. ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేసవిలో దాహార్తి తీర్చేందుకు అటవీ ప్రాంతంలో ఉండే మడుగులు, చలమల్లో నీటి నిల్వలు అడుగుంటాయి. దీంతో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల వైపు పరుగులు తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి. తాగునీటి వనరులను అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అటవీ ప్రాంతం ఇలా..
నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల సరిహద్దులు ఆనుకుని సుమారు 5.40 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. పెంచలకోన అటవీ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ఆత్మకూరు, ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లు, కుందేలున్నాయి. ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, ఉడుములు, కణుతులు కూడా ఉన్నాయి.
వేసవిలో ఇబ్బందులు
వేసవి వచ్చింటే అటవీ ప్రాంతంలో ఉండే జలాలు పూర్తిగా ఎండిపోతాయి. దీంతో ప్రాణులు నీటి కోసం అటవీ ప్రాంతం వదలి మైదానాల వైపు పరుగులు తీస్తాయి. ఈ క్రమంలో నెల్లూరు – బద్వేలు, కావలి – సీతారామపురం, ఉదయగిరి – నందవరం తదితర రహదారులు, గ్రామాల వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కొంతమంది నాటు తుపాకులు, నాటు బాంబులు, పేలుడు పదార్థాలు ఉపయోగించి మట్టుబెడుతున్నారు. మరికొన్ని రోడ్డు ప్రమదాల బారిన పడి మృత్యవాత పడుతున్నాయి.
ప్రత్యేక చర్యలు అవసరం
వేసవి కాలం ప్రారంభమై ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి కోసం వన్యప్రాణులు అటవీ ప్రాంతం వదిలి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించాలి. నిధులు సక్రమంగా ఖర్చు చేసి కుంటల్లో నీరు నిల్వ చేయాలి. ట్యాంకర్లతో తొట్టెల్లో నీరు నింపాలి. అసరమైతే నీటి కుంటలు మరికొన్ని ఏర్పాటు చేయాలి. సహజ సిద్ధంగా ఉన్న కుంటల్లో నీరుండేలా చర్యలు చేపట్టాలి. దీంతో పులులు, జింకలు, చిరుతలు, దుప్పలు తదితర వన్యప్రాణులు అక్కడకి వచ్చి నీరు తాగుతాయి. గ్రామాలవైపు వచ్చే అవసరం ఉండదు.
సంరక్షణకు..
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతం అనుకుని ఉన్న గ్రామాల్లో ఆ శాఖ అధికారులు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వేసవిలో అడవుల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరిగిన ఘటనలున్నాయి. దీని నివారణకు కళాజాతా బృందాలతో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అడవుల్లో అడుగంటిన నీటి నిల్వలు
దాహార్తితో గ్రామాల్లోకి వన్యప్రాణులు
మృత్యవాత పడుతున్న వైనం
రాబోయే రోజుల్లో సమస్య మరింత జటిలం
ప్రత్యామ్నాయంపై దృష్టి అవసరం
వన్యప్రాణుల గొంతెండుతోంది
వన్యప్రాణుల గొంతెండుతోంది
వన్యప్రాణుల గొంతెండుతోంది


