పొదలకూరు: రోజూ ఇంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశామని అధికారులు ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇందుకు ఈ రైతు పడుతున్న ఆవేదనే ఉదాహరణ. మండలంలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన రైతు అరెద్దుల విజయ్‌కుమార్ రబీలో 10.30 ఎకరాల్లో బీపీటీ 5204 రకం వరిసాగు చేపట్టాడు. కోతల అనంతరం ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబెట్టాడు. తాటిపర్తి కేంద్రం వద్దకు వెళ్లి కొనుగోలు చేయాల్సిందిగా కోరాడు. గోతాలు లేవని, ట్రక్ షీట్ ఇచ్చేందుకు మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ లేదని అక్కడి వారు సాకులు చెబుతున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కువ రోజులు ఉంచుకుంటే ధరలు పతనమవుతాయని నేరుగా నెల్లూరుకు సమీపంలోని శ్రీలక్ష్మి రైస్‌మిల్లు వద్దకు వెళ్లాడు. వారు తేమ శాతం సమస్య చెప్పి తీసుకోవడం కుదరదని వెల్లడించారు. దీంతో దిక్కుతోచక రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. అటు దళారులకు అమ్ముకోలేక, ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నాడు. అకాల వర్షం వస్తే ధాన్యాన్ని దాచుకునే వీలు కూడా లేదని ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంతా బాగుందని చెప్పుకొంటోంది.


