ప్రాణాలు తీసిన అతివేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన అతివేగం

Mar 23 2025 12:10 AM | Updated on Mar 23 2025 12:11 AM

● ఆటోను బైక్‌ ఢీకొని ముగ్గురి దుర్మరణం ● మృతుల్లో ఇద్దరు ఐటీఐ విద్యార్థులు, ఆటో డ్రైవర్‌

మనుబోలు: నిర్లక్ష్యంగా అతి వేగంతో బైక్‌ నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మనుబోలు మండలంలోని గొట్లపాళెం వద్ద శనివారం జరిగింది. మూడు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన ఆటోడ్రైవర్‌ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సైదాపురం మండలం ఊటుకూరు దళితవాడుకు చెందిన నోసిన వెంకటేశ్వర్లు కుమారుడు వరుణ్‌కుమార్‌ (18), అర్తనపల్లి శంకరయ్య కుమారుడు నందకిశోర్‌ (18), మరో కుమారుడు అర్తనపల్లి ఈశ్వర్‌ ముగ్గురు మిత్రులు. వీరిలో వరుణ్‌కుమార్‌, నందకిశోర్‌ గూడూరులోని కళ్యాణ్‌ చక్రవర్తి కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. ఈ ముగ్గురు కలిసి బైక్‌పై నెల్లూరుకు పనిమీద వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గొట్లపాళెంలో ఉంటున్న వరుణ్‌ అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు నెల్లూరు నుంచి కసుమూరు, వడ్లపూడి మీదుగా వేగంగా వస్తున్నారు. అదే సమయంలో పొదలకూరు నుంచి ప్రయాణికులతో వడ్లపూడి వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన బైక్‌ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వరుణ్‌కుమార్‌, నందకిషోర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్‌ తురకా సురేంద్ర (38) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెనుక ఉన్న ఈశ్వర్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేంద్ర మృతి చెందాడు. మృతులు ముగ్గురివి పేద కుటుంబాలే. అతి వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాలను రోడ్డుపాల్జేసింది. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, మనుబోలు ఎస్సై శివరాకేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడు కుటుంబాల్లో విషాదం

ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. ఊటుకూరుకు చెందిన ఇద్దరు యువకులు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికంది వచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రోడ్డున పడిన ఆటో డ్రైవర్‌ కుటుంబం

ఆటో డ్రైవర్‌ సురేంద్రది పొదలకూరు కాగా అతను వడ్లపూడిలో పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సురేంద్ర మృతి చెందడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి రోడ్డున పడినట్లు అయింది.

ముగ్గురు యువకుల అతివేగం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఒకే బైక్‌పై మితిమీరిన వేగంతో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఇద్దరు యువకులతోపాటు ఆటో డ్రైవర్‌ కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. పనిమీద నెల్లూరుకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో యువకుల్లో ఒకరి అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు.

ప్రాణాలు తీసిన అతివేగం 1
1/2

ప్రాణాలు తీసిన అతివేగం

ప్రాణాలు తీసిన అతివేగం 2
2/2

ప్రాణాలు తీసిన అతివేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement