
మోసపోయాం.. న్యాయం చేయండయ్యా
బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ కృష్ణకాంత్
● ఎస్పీకి బాధితుల వినతి
నెల్లూరు(క్రైమ్): ఉద్యోగాలు.. మెడికల్ సీట్లు.. వీసాల పేరిట రూ.లక్షల్లో దోచేసిన మోసగాళ్లపై చర్యలు చేపట్టాలని పలువురు బాధితులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీకి కృష్ణకాంత్‌కు 75 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వీటిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర, కావలి డీఎస్పీలు సింధుప్రియ, శ్రీధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● వాట్సాప్‌లో జ్యోతిర్నాథ్ పరిచయమై సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి రూ.2.1 లక్షలను తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా, ఉద్యోగమిప్పించకపోవడంతో గట్టిగా ప్రశ్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. అతనిపై చర్యలు చేపట్టాలని వేదాయపాళేనికి చెందిన ఓ యువకుడు ఫిర్యాదు చేశారు.
● తమిళనాడుకు చెందిన లక్ష్మీనారాయణ, సెల్వం అదే రాష్ట్రంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇప్పించకపోవడంతో నిలదీయగా, దౌర్జన్యం చేస్తున్నారు. వీరిపై చర్యలు చేపట్టాలని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరారు.
● వేదాయపాళేనికి చెందిన వెంకట్రావు బీవీనగర్‌లోని స్టీల్ కంపెనీలో డీజిల్ మోటార్లను ఇప్పిస్తానని రూ.4.2 లక్షలు తీసుకున్నారు. వీటిని ఇప్పించకుండా కాలయాపన చేస్తుండటంతో ఇటీవల గట్టిగా నిలదీయగా, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విన్నవించారు.
● అబుదాబీలో పనిచేసేందుకు వర్కింగ్ వీసా ఇప్పిస్తామని, నెలకు రూ.80 వేల జీతమొస్తుందని నమ్మించి రూ 2.7 లక్షలను విజయవాడకు చెందిన రామకృష్ణ, దివ్య, జగిత్యాలకు చెందిన శ్రీనివాస్, రిజ్వానా, ఆస్సు తీసుకున్నారు. విజిటింగ్ వీసా ఇచ్చి మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వీరిపై చర్యలు చేపట్టాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వ్యక్తి విజ్ఞప్తి చేశారు.
● ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలిప్పిస్తామంటూ మా వద్ద రూ.5.62 లక్షలను అనంతసాగరానికి చెందిన ఖాజామొహిద్దీన్ తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో, నిలదీయగా దౌర్జన్యం చేస్తున్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని అదే ప్రాంతానికి చెందిన చెందిన ఇద్దరు యవకులు కోరారు.
● తన పేరుపై ఉన్న ఆస్తిని రాసివ్వాలని కొడుకు, కోడలు చిత్రహింసలకు గురిచేస్తూ, తన వస్తువులను ధ్వంసం చేసి దుస్తులను కాల్చేశారు. వీరిపై చర్యలు చేపట్టాలని తోటపల్లిగూడూరుకు చెందిన ఓ వృద్ధుడు విన్నవించారు.
● అల్లూరుకు చెందిన సుమంత్, అతని తండ్రి నాపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని అల్లూరుకు చెందిన ఓ వృద్ధుడు వేడుకున్నారు.