● బ్రహ్మదేవి రైతుల ఆందోళన
ముత్తుకూరు: ‘బీపీటీ రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కడం లేదు. మిల్లర్ల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నాం’ అని మండలంలోని బ్రహ్మదేవి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల వల్ల ధాన్యం అమ్మకం చేసే పరిస్థితి కరువైపోయిందని వాపోయారు. మూడు రోజులు ఎండలో ధాన్యం ఆరబెట్టి మిల్లర్ల వద్దకు తీసుకెళ్తే 18 శాతం తేమ ఉన్నట్టు సాకులు చూపి, నాలుగు కిలోల మేర దోచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రెండో పంటకు తాము సిద్ధంగా లేమంటూ ప్రకటించారు. ఎన్నికలకు ముందు పాత ధాన్యం పుట్టి రూ.27,000లకు పైగా అమ్మకం చేశామని, కూటమి ప్రభుత్వంలో ధర క్రమంగా తగ్గిపోయిందన్నారు. ఈ మాయాజాలం వెనుక ఎవరి హస్తం ఉందని రైతులు ప్రశ్నించారు. ప్రస్తుతం పాత వాటి ధర రూ.20,000లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు.