
అగ్రిగోల్డ్ సంపద దొంగలను వదలం
ఉదయగిరి: వైఎస్సార్‌సీసీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ జామాయిల్, ఎర్రచందనం సంపద దోచేసిన దొంగలను వదలమని, వారి నుంచి ప్రతి పైసా వసూలు చేసి అగ్రిగోల్డ్ బాధితులకు అందజేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఉదయగిరి నియోజవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీతో కలిసి వరికుంటపాడు మండలం కనియంపాడు, భాస్కరాపురంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో కొట్టేసిన వృక్ష సంపదను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ హేమంత్‌కుమార్‌ను కలిసి అగ్రిగోల్డ్ భూముల్లో పట్టపగలే వృక్ష సంపదను దోపిడీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కాకాణి మాట్లాడుతూ 2014 చంద్రబాబు పాలనలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగు చూసిందని, దీనికి బాధ్యులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడినా పట్టించుకోకుండా కంపెనీ యాజమాన్యంపై వల్లమాలిన ప్రేమ చూపించారన్నారు. కోర్టుల జోక్యంతో సీఐడీకి అప్పగించారన్నారు. తమకు న్యాయం జరుగుతుందని బాధితులు భావిస్తున్న తరణంలో 15 ఏళ్లుగా 70 ఎకరాల్లో పెరిగిన రూ.3.5 కోట్ల విలువ చేసే సంపదను టీడీపీ నేతలు నరికి సొమ్ము చేసుకున్నారన్నారు. ప్రభుత్వ అధీనంలోని సీఐడీ జప్తు చేసిన సొమ్మును పట్టపగలు దోచేస్తే చర్యలు తీసుకోకుండా పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్నారు. అధికారులు, పోలీసులు దొంగలను పట్టుకోవడం మానేసి మమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ఎప్పుడూ ఇంతగా వేధించిన పరిస్థితులు లేవు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులు, రెవెన్యూ అఽధికారులు గుర్తించుకోవాలన్నారు. మాకు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసినా జైలుకు పంపించడం ఖాయమన్నారు.
సంపద సృష్టించడం అంటే దోపిడీనా?
సంపద సృష్టించడం అంటే దోపిడీనా అని ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు. పట్టపగలే అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికి తీసుకెళ్తుంటే వ్యవస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయని విమర్శించారు. అధికారులు తప్పులు చేసి బలికావద్దు. తిరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, భవిష్యత్‌లో కార్యకర్తల మాటే జగన్ చర్యగా ఉంటుందని గ్రహించాలన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దిగమింగినదంతా కక్కించి బాధితులకు అందజేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
అగ్రిగోల్డ్ భూములు పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో పహారా కాశారు. పోలీసులు అడ్డుంకులు, ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా క్షేత్ర పర్యటన చేసి, జామాయిల్ కర్రను నరికి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు షేక్ అలీ అహ్మద్, ఎం. తిరుపతినాయుడు, సిద్ధయ్య, గుర్రం భాస్కర్‌రెడ్డి, ఎం.మురళీకృష్ట, ఆంజనేయులు, చెన్నారాయుడు, మున్నంగి శ్రీనివాసులు, బొడ్డు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
అవినీతి అధికారులకు
అరదండాలు తప్పవు
వరికుంటపాడులో అగ్రిగోల్డ్
భూముల పరిశీలన
మాజీ మంత్రి కాకాణి, మేకపాటి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, మేరిగ

అగ్రిగోల్డ్ సంపద దొంగలను వదలం