LLC 2022: యూసఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ల గొడవ.. అంపైర్‌ తలదూర్చినా!

Yusuf Pathan-Mitchell Jhonson Heat Argument Semi-Final Match LLC 2022 - Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో భాగంగా ఆదివారం బిల్వారా కింగ్స్‌, ఇండియా క్యాపిటల్స్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ గొడవ తారాస్థాయిలో జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు. అంపైర్‌తో పాటు మిగతా ఆటగాళ్లు తలదూర్చి వారిని విడదీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ​

విషయంలోకి వెళితే.. బిల్వారా కింగ్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో జట్టు బ్యాటర్‌ యూసఫ్‌ పఠాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు.ఇండియా క్యాపిటల్స్‌ బౌలర్‌ మిచెన్‌ జాన్సన్‌ బౌలింగ్‌ పఠాన్‌ బౌండరీలు బాదాడు. అయితే ఓవర్‌ ముగిసిన తర్వాత మిచెల్‌ జాన్సన్‌ పఠాన్‌పై నోరు పారేసుకున్నాడు. తాను ఏం తక్కువ తినలేదంటూ యూసఫ్‌ పఠాన్‌ కూడా జాన్సన్‌ను తిట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.

దీంతో కోపంతో యూసఫ్‌ పఠాన్‌ జాన్సన్‌ వైపు దూసుకొచ్చాడు. అయితే జాన్సన్‌ పఠాన్‌ను తోసేశాడు. ఇక గొడవ తారాస్థాయికి చేరిందన్న క్రమంలో అంపైర్‌ తలదూర్చి జాన్సన్‌ను పక్కకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కడా తగ్గలేదు. ఇరుజట్ల కెప్టెన్లు, అంపైర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే 48 పరుగులు చేసిన యూసఫ్‌ పఠాన్‌ మిచెల్‌ జాన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడం గమనార్హం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇండియా క్యాపిటల్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బిల్వారా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ 65 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్‌ 59, యూసఫ్‌ పఠాన్‌ 48, రాజేష్‌ బిష్ణోయి 36 నాటౌట్‌ రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్‌ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. రాస్‌ టేలర్‌ 39 బంతుల్లో 84 పరుగులు చేయగా.. చివర్లో ఆష్లే నర్స్‌ 28 బంతుల్లో 60 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.

ఇక క్వాలిఫయర్‌ 1లో ఓడినప్పటికి బిల్వారా కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ జెయింట్స్‌తో బిల్వారా కింగ్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్‌ 5న ఇండియా క్యాపిటల్స్‌తో ఫైనల్‌ ఆడనుంది.

చదవండి: ఓయ్‌ చహల్‌.. ఏంటా పని?

'బౌలింగ్‌ లోపాలు సరిదిద్దుకుంటాం.. సూర్య నేరుగా అక్టోబర్‌ 23నే' 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top