LLC 2022: మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ

Yusuf-Johnson Argument: Report Claims Pathan Sledge Female Umpire - Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2022లో ఆదివారం బిల్వారా కింగ్స్‌, ఇండియా క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌ల గొడవ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ ఇద్దరు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌ అనంతరం యూసఫ్‌ పఠాన్‌, మిచెల్‌ జాన్సన్‌లు ఒకరినొకరు క్షమాపణ చెప్పుకున్నారు. 

అయితే గొడవకు ప్రధాన కారణం యూసఫ్‌ పఠాన్‌ మహిళా అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించడమేనని ఫాక్స్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ట్విటర్‌లో పేర్కొంది. బిల్వారా కింగ్స్‌, ఇండియా క్యాపిటల్స్‌ మ్యాచ్‌కు కిమ్‌ కాటన్‌ అంపైరింగ్‌ విధులు నిర్వహించింది. కాగా మ్యాచ్‌ సందర్భంగా మిచెల్‌ జాన్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఒక బంతిని కిమ్‌ కాటన్‌ వైడ్‌ కాల్‌ ఇవ్వలేదు. దీంతో కాటన్‌ను ఉద్దేశించి యూసఫ్‌ పఠాన్‌ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఫాక్స్‌ క్రికెట్‌ వెల్లడించింది. ఇదే విషయమై ఓవర్‌ తర్వాత ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందని పేర్కొంది. ''మిచెల్‌ది ఏం తప్పు లేదు.. పఠాన్‌ మహిళా అంపైర్‌ కిమ్‌ కాటన్‌తో దురుసుగా ప్రవర్తించాడు.. అందుకే గొడవ జరిగింది'' అంటూ తెలిపింది.

యూసఫ్‌ను తోసేసిన కారణంగా మిచెల్‌ జాన్సన్‌కు క్రమశిక్షణ చర్యల కింద లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ కమిషనర్‌ రవిశాస్త్రి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. ఇక యూసఫ్‌ పఠాన్‌ మాత్రం జరిమానా నుంచి తప్పించుకున్నాడు. ఇదే విషయాన్ని లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సీఈవో రామన్‌ రహేజా స్పందించాడు.

''లెజెండ్స్‌ లీగ్‌ ద్వారా ఒక సీరియస్‌, కాంపిటీటివ్‌ క్రికెట్‌ను మాత్రమే ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఆదివారం మ్యాచ్‌ సందర్భంగా జరిగిన గొడవ బాధాకరం. అయితే గొడవకు సంబంధించి ఎవరిది తప్పు ఉందో తెలుసుకోవడానికి వీడియోను చాలాసార్లు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాం. తప్పెవరిదనేది పక్కనబెడితే మిచెల్‌ జాన్సన్‌.. పఠాన్‌ను తోసేసినట్లు క్లియర్‌గా కనిపించడంతో అతనికి జరిమానా విధించాం. ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆశిస్తున్నాం. మళ్లీ రిపీట్‌ అయితే ఉపేక్షించేది లేదు. సీరియస్‌ యాక్షన్‌ కచ్చితంగా ఉంటుంది'' అని పేర్కొన్నాడు.  

చదవండి: యూసఫ్‌ పఠాన్‌,మిచెల్‌ జాన్సన్‌ల గొడవ.. అంపైర్‌ తలదూర్చినా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top