
న్యూఢిల్లీ: తాను రిటైర్మెంట్ ప్రకటించినంటూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేసిన ప్రకటనపై అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ‘నేను రిటైరయ్యాను’ అని సింధు చేసిన పోస్ట్ గందరగోళానికి గురి చేసింది. అయితే అది బ్యాడ్మింటన్ ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పిన ప్రకటన కాదని తర్వాత తెలియడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడు ఇంత వ్యంగ్యం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు.
కాగా, సింధు చేసిన ప్రకటనపై కేంద్ర క్రీడామంత్రి కిరెన్ రిజుజు సైతం స్పందించారు. ఒక చిన్నపాటి షాక్‌కు గురి చేశావంటూ ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. ‘ సింధు.. నువ్వు మినీ షాకిచ్చావ్. నీ శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. నేను కచ్చితంగా చెప్పగలను.. నీ బలం, నీ శక్తితో మరెన్నో విజయాలను భారత్‌కు అందిస్తావని ఆశిస్తున్నా’ అని పోస్ట్ చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇస్తున్నాననే క్రమంలోనే సింధు ‘ఐ రిటైర్’ అంటూ పోస్ట్ చేసి గందరగోళానికి తెరతీసింది. ఇంత ఆకస్మికంగా సింధు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది. డెన్మార్క్ ఓపెన్ చివరది అంటూ వెల్లడించడం ఇంకా అయోమయానికి గురి చేసింది. కాగా, కరోనా కారణంగా ఆటకు కాస్త విరామం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సింధు ఇలా చేసిందని భావిస్తున్నారు. ఇక కిరెన్ రిజుజు ట్వీటర్ పోస్ట్ కూడా సింధు పూర్తిగా ఆటకు స్వస్తి పలకలేదని విషయాన్ని తెలియజేస్తోంది.
You actually gave a mini shock @Pvsindhu1 but I had unflinching faith in your power of determination. I'm sure you have the strength and stamina to bring many more laurels for India 🇮🇳! https://t.co/D4VIT7Poyv
— Kiren Rijiju (@KirenRijiju) November 2, 2020
‘కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి.‘డెన్మార్క్ ఓపెన్ జరగలేదు. కానీ, నేను ప్రాక్టీస్ చేయటం మానలేదు. ఏషియా ఓపెన్‌కు ప్రిపేర్ అవుతున్నాను. దేన్ని కూడా సులభంగా వదిలి పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడేవరకు పోరాడుతూనే ఉంటాను’ అని సింధు పోస్ట్ చేశారు.