World Test Championship Final India Vs New Zealand: Players To Watch Out For - Sakshi
Sakshi News home page

‘చాంపియన్‌’ టెస్టుకు రెడీ

Jun 18 2021 4:27 AM | Updated on Jun 18 2021 1:29 PM

WTC finalists India and New Zealand - Sakshi

విజేతకు బహుకరించే ఐసీసీ గదతో కోహ్లి, విలియమ్సన్‌

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 2009లోనే తొలి సారి నంబర్‌వన్‌గా నిలిచింది. టెస్టు ల్లో అగ్రస్థానానికే ఇప్పటి వరకు ప్రపంచ కప్‌ విజేత తరహా హోదా కల్పిస్తూ ప్రతీ ఏటా ఐసీసీ గదను, నగదును ఇచ్చి విజేతను గుర్తిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ లెక్క వేరు... టెస్టు ప్రపంచ చాంపియన్‌ లెక్క వేరు. సాంప్రదాయ క్రికెట్‌లో జగజ్జేతగా గుర్తించాలంటే డబ్ల్యూటీసీ కిరీటం అందుకోవడమే సరైందని ఖాయమైన నేపథ్యంలో తొలి ఫైనల్‌కు టీమిండియా సిద్ధమైంది. మరో వైపు రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే ప్రపంచకప్‌లో అనూహ్య ఫలితంతో గుండె పగిలిన న్యూజిలాండ్‌ అక్కడే మరో ఫార్మాట్‌లో విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరానికి నేడు తెర లేవనుంది.
 
సౌతాంప్టన్‌: ప్రతిష్టాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) తుది సమరానికి భారత్, న్యూజిలాండ్‌ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు తొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలుస్తుంది. 2019–21 మధ్య కాలంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో సాధించిన పాయింట్లను బట్టి భారత్, కివీస్‌ ఫైనల్‌ చేరాయి. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు... మ్యాచ్‌కు ఒక రోజు ముందే టీమిండియా తమ తుది జట్టును ప్రకటించింది. ఐదుగురు రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్, వికెట్‌ కీపర్‌తో పాటు ముగ్గురు పేస్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించింది. ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి ఓపెనింగ్‌ చేయనున్న రోహిత్‌ అక్కడి పరిస్థితుల్లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మరో ఓపెనర్‌ గిల్‌ కూడా తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగుతున్నాడు.

వీరిద్దరు శుభారంభం అందిస్తే ఆ పునాదిపై జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. తర్వాతి మూడు స్థానాల్లో సీనియర్లు పుజారా, కోహ్లి, రహానే బ్యాటింగ్‌ భారం మోస్తారు. టెస్టు క్రికెట్‌ వీరికి ఉన్న అనుభవం, అన్ని పరిస్థితుల్లోనూ ఆడగల నైపుణ్యం జట్టుకు కీలకం కానుంది. వికెట్‌ కీపర్‌ పంత్‌ కూడా తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తే భారత్‌కు తిరుగుండదు.  బౌలింగ్‌లో తమ అత్యుత్తమ బలగాన్ని భారత్‌ బరిలోకి దించుతోంది. బుమ్రా, షమీల జోడి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు మరోసారి జత కట్టింది. మూడో పేసర్‌గా సిరాజ్‌ పేరు ముందుకు వచ్చినా... 101 టెస్టుల ఇషాంత్‌ అనుభవాన్నే జట్టు నమ్ముకుంది. ఇక స్పిన్‌ ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో అశ్విన్, జడేజాలిద్దరికీ టీమ్‌లో చోటు లభించింది. పైగా వీరిద్దర బ్యాటింగ్‌ జట్టుకు అదనపు బలం. ముఖ్యంగా గత కొంత కాలంగా జడేజా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం కారణంగా ఆంధ్ర ఆటగాడు విహారిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది.

పదునైన బౌలింగ్‌తో...
1999 తర్వాత ఇంగ్లండ్‌లో తొలి టెస్టు సిరీస్‌ విజయం సాధించిన న్యూజిలాండ్‌ అమితోత్సాహంతో ఉంది. పైగా భారత్‌తో పోలిస్తే ఇటీవలే రెండు టెస్టులు ఆడిన ఆ జట్టుకు ఇక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఓపెనర్‌ కాన్వే అద్భుత ఫామ్‌లో ఉండగా, లాథమ్‌ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. ఇక కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. టేలర్, నికోల్స్‌లతో పాటు కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడనున్న వాట్లింగ్‌తో జట్టు బ్యాటింగ్‌ బలం పెరిగింది. ముగ్గురు వైవిధ్యమైన పేసర్లు బౌల్ట్, వాగ్నర్, సౌతీలు తమకు అనుకూలమైన స్వింగ్‌ పరిస్థితుల్లో చెలరేగిపోతే వారిని ఎదుర్కోవడం భారత్‌కు సులువు కాదు. భారత్‌ ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన నేపథ్యంలో కనీసం ఒక స్పిన్నర్‌నైనా కివీస్‌ ఆడిస్తే ఎజాజ్‌ పటేల్‌ ఎంపిక ఖాయం.

పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉంది. గురువారం ట్రోఫీ ఆవిష్కరణ సమయంలోనే రోజ్‌ బౌల్‌ మైదానంలో వర్షం కురుస్తూ ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దాదాపు ప్రతీ రోజు వాన అంతరాయం కలిగించవచ్చు. ఐదు రోజుల తర్వాత ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కూడా ఉంది. పేస్, బౌన్స్‌తో నిండిన పిచ్‌ ఆరంభంలో సీమర్లకు అనుకూలిస్తుంది. ఎండ కాస్తే మాత్రం స్పిన్‌ ప్రభావం చూపించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement