WPL 2023: ముంబై ఇండియన్స్‌ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఒక్క మ్యాచ్‌తోనే రికార్డు గల్లంతు

WPL 2023 DC VS RCB: Delhi Capitals Scores Highest WPL Total - Sakshi

మహిళల ఐపీఎల్‌ (WPL) అరంగేట్రం సీజన్‌ (2023)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్‌ లాన్నింగ్‌ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో విరుచుకుపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

షఫాలీ, లాన్నింగ్‌లను హీథర్‌ నైట్‌ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపడంతో స్కోర్‌ కాస్త మందగించింది. ఒకవేళ వీరిద్దరూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే సీన్‌ వేరేలా ఉండేది. ఆఖర్లో మారిజాన్‌ కాప్‌ (17 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్‌ (15 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు) కూడా చెలరేగి ఆడారు. డీసీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ మినహాయించి ప్రతి ఓవర్‌లో కనీసం ఓ బౌండరీ నమోదైందంటే డీసీ బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్‌ సాగిందో ఇట్టే అర్ధమవుతుంది.

ఈ మ్యాచ్‌లో డీసీ 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ నెలకొల్పిన 207 పరుగుల టీమ్‌ టోటల్‌ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్‌ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్‌కు డబ్ల్యూపీఎల్‌ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. 

224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కాగా, డబ్ల్యూపీఎల్‌-2023 తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన గుజరాత్‌ జెయింట్స్‌ 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top