World Badminton Championship: భారత్‌కు రజత, కాంస్యాలు.. ప్రైజ్‌మనీ మాత్రం ఉండదు!

World Badminton Championship: Lakshya Sen Comments Says Not Satisfied - Sakshi

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు లక్ష్య సేన్‌. అయితే, తన ప్రదర్శన పట్ల మాత్రం సంతృప్తిగా లేనని, వచ్చే ఏడాది స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ పసిడి గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోగా... సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్‌ (భారత్‌) కాంస్యం గెలుచుకున్నాడు.

దీంతో.. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లోభారత్‌ ఖాతాలో ఒకేసారి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఇలా జరగడం ఇది రెండోసారి. అంతకుముందు... 2017లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, లక్ష్య సేన్‌ పతకాలు సాధించారు.  కాగా ఈ మెగా టోర్నీలో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్‌మనీ ఉండదు.  

సంతోషమే.. కానీ..
పతకం గెలిచిన లక్ష్య సేన్‌ మాట్లాడుతూ... ‘చరిత్ర సృష్టించడానికి చేరువగా వచ్చి సెమీఫైనల్లో ఓడటం బాధగా ఉంది. ఏదైతేనేం... నాకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం దక్కింది. అయితే నేను ఈ పతకంతో సంతృప్తి చెందడంలేదు. ఓవరాల్‌గా టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఆడుతున్నప్పటికీ... కాంస్యం సాధించి నా గురువు ప్రకాశ్‌ పదుకొనే సరసన నిలవడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top