సూపర్‌ సోఫీ...

Womens Premier League 2023: Royal Challengers Bangalore beat Gujarat Giants by eight wickets - Sakshi

36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99

189 పరుగుల లక్ష్యాన్ని15.3 ఓవర్లలో ఛేదించిన బెంగళూరు   

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఫామ్‌లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.

బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సోఫీ డివైన్‌ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్‌ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు), హీథెర్‌ నైట్‌ (15 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్‌ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్‌నర్‌ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  

ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి
ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్‌ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసీ వాంగ్‌ (32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్‌ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్‌గ్రాత్‌ (38; 6 ఫోర్లు, 1 సిక్స్‌), గ్రేస్‌ హారిస్‌ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీప్తి శర్మ (13 నాటౌట్‌; 1 ఫోర్‌), సోఫీ ఎకిల్‌స్టోన్‌ (16 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top