IND vs LEIC: షమీని ఎదుర్కోలేక జట్టు మారిన పుజారా..

Why Cheteshwar Pujara Bat Both Teams India-Leicestershire Warm-Up Match - Sakshi

మనం ఇంటిదగ్గర ఆడుకునే క్రికెట్‌లో అవతలి జట్టులో ఎవరైనా వ్యక్తి తక్కువైతే మన జట్టులో నుంచి ఒక వ్యక్తిని అక్కడ సర్దుబాటు చేయడం చూస్తుంటాం. ఇలాంటివి గల్లీ క్రికెట్‌లో ఎక్కువగా ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే లీస్టర్‌షైర్‌, టీమిండియాల మధ్య జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో జరిగింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా వార్మప్‌ మ్యాచ్‌లో రెండు జట్ల తరపున బ్యాటింగ్‌కు వచ్చాడు.

మొదట లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన పుజారా తొలి ఇన్నింగ్స్‌లో షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా పెవిలియన్‌ వెళ్తున్న పుజారాను వెనుక నుంచి హగ్‌ చేసుకొని వింత సెలబ్రేషన్‌ చేసుకున్నాడు. అయితే మహ్మద్ షమీని ఎదుర్కోవడం కష్టంగా ఉందని భావించాడేమో  రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీమిండియా తరపున బ్యాటింగ్‌కి వచ్చాడంటూ అభిమానులు పేర్కొన్నారు.

కానీ అసలు సంగతి అది కాదు. వార్మప్‌ మ్యాచ్‌ నాలుగు రోజులే కావడం.. రోజు వర్షం కురుస్తుండడంతో ఆటకు అంతరాయం ఏర్పడుతుంది. మూడో రోజు ఆటలో కూడా ఉదయం పూట వర్షం అడ్డుపడింది. దీంతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు అంతరాయం కలిగింది. ఒకవేళ నాలుగో రోజు లీస్టర్‌షైర్‌ తరపున ఆడితే వర్షం వల్ల పుజారాకు బ్యాటింగ్‌ అవకాశం రాకపోవచ్చని టీమిండియా భావించింది. అందుకే పుజారాను టీమిండియా తరపున బ్యాటింగ్‌కు దించింది.అయితే పుజారా మరోసారి విఫలమయ్యాడు. 22 పరుగులు చేసి సాయి కిషోర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీగానే పరుగులు రాబడుతుంది. జట్టులో ప్రతీ ఒక్క బ్యాట్స్‌మన్‌ తలా ఇన్ని పరుగులు చేశారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి 98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి అర్థసెంచరీతోనే సరిపెట్టాడు. ఇక ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన కోన శ్రీకర్‌ భరత్‌ 43 పరుగులు చేసి ఆకట్టుకోగా.. గిల్‌ 38, హనుమ విహారి 20 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత శార్దూల్‌ ఠాకూర్‌ 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ 52, రవీంద్ర జడేజా 22 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: తొలిసారి రంజీ ట్రోఫీ అందుకోనున్న మధ్యప్రదేశ్..!

కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top