ఆటకు శామ్యూల్స్‌ టాటా

West Indies star cricketer Marlon Samuels has retired from cricket - Sakshi

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విండీస్‌ స్టార్‌

కింగ్‌స్టన్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్, వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల శామ్యూల్స్‌ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. 2018 డిసెంబర్‌లో శామ్యూల్స్‌ చివరిసారి వెస్టిండీస్‌ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్‌లో అడుగుపెట్టిన శామ్యూల్స్‌ ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు.  కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అతని ప్రదర్శనతోనే విండీస్‌ రెండుసార్లు టి20 వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాలు కూడా లభించాయి.  శామ్యూల్స్‌ కెరీర్‌లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్‌ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్‌ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించారు.  ఓవరాల్‌గా తన కెరీర్‌లో శామ్యూల్స్‌ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top