సిక్సర్ల తెవాటియకు కోహ్లి కానుక

Virat Kohli Gifted A Special Autographed Jersey To Rahul Tewatia - Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న రాజస్తాన్‌ రాహుల్‌ తెవాటియను విరాట్‌ కోహ్లి అభినందించాడు. ఆటోగ్రాఫ్‌తో కూడిన తన జెర్సీని ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లి అతనికి కానుకగా ఇచ్చాడు. మరింత మెరుగ్గా రాణించాలని శుభాకాంక్షలు చెప్పాడు. ఇక పేవరెట్‌ ఆటగాడి నుంచి అందిన బహుమతిపై తెవాటియ ఆనందం వ్యక్తం చేశాడు. కోహ్లికి థాంక్స్‌ చెప్పాడు. ఈ ఫొటోను ఐపీఎల్‌ సంస్థ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా, పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్‌ తెవాటియ కీలక ఇన్నింగ్స్‌తో ఛేదించిన సంగతి తెలిసిందే. ఓ దశలో 19 బంతుల్లో 8 పరుగులే చేసిన అతనిపై జిడ్డు బ్యాటింగ్‌ అంటూ విమర్శలు వచ్చాయి. 

ఇంత భారీ టార్గెట్‌ ముందు పెట్టుకుని ఇదేం ఆటరా నాయనా అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు తిట్టిపోశారు. అయితే, ఇన్నింగ్స్‌ చివరి సమయంలో అతను జూలు విదిల్చాడు. రవి బిష్ణోయ్‌ (15 వ ఓవర్‌) బౌలింగ్‌లో తొలి సిక్స్‌ బాదిన తెవాటియ.. 18 వ ఓవర్‌లో షెల్డన్‌ కాట్రెల్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 5 సిక్స్‌లు బాదడంతో రాజస్తాన్‌ గెలుపు ముంగిట నిలిచింది. షమీ వేసిన 19 ఓవర్‌లోనూ సిక్స్‌ బాదిన తెవాటీయ (31 బంతుల్లో 53, 7 సిక్స్‌లు) జట్టు స్కోరు సమం అయిన తర్వాత ఔట్‌ అయ్యాడు. మిగతా లాంఛనాన్ని టామ్‌ కరణ్‌ పూర్తి చేశాడు. ఇక మామూలుగా వికెట్‌ తీశాక సెల్యూట్‌ చేసే కాట్రెల్‌ ఈసారి రాహుల్‌ తెవాటియాకు సెల్యూట్‌ చేయకతప్పలేదని సోషల్‌ మీడియాలో అభిమానులు సరదా కామెంట్లు చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top