ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ చాంపియనా: విరాట్‌ కోహ్లి

Virat Kohli calls for best-of-three WTC finals to decide Test champions - Sakshi

సౌతాంప్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌ను నిర్ధారించేందుకు ఒక ఫైనల్‌ మ్యాచ్‌ సరిపోదని, బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌లోనే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. బుధవారం మ్యాచ్‌ ముగిసిన అనంతరం అతను మీడియాతో ముచ్చటించాడు. ‘నేను చెప్పేదొకటే... ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ అత్యుత్తమ జట్టు ఏదో ఖరారు చేయలేం! ఇది ఎంత మాత్రం సమంజసంగా లేదు. దీన్ని నేను అంగీకరించను కూడా. ఇది టెస్టు చాంపియన్‌షిప్‌ అయితే ఇందుకు తగినట్లే సిరీస్‌ ఉండాలి. అంటే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహించాలి. అప్పుడే ఒక మ్యాచ్‌లో విఫలమైన జట్టు మరో మ్యాచ్‌లో ముందంజ వేస్తుందో లేదో తెలుస్తుంది. అలా సిరీస్‌ అసాంతం బాగా ఆడిన జట్టే ప్రపంచ టెస్టు విజేత అవుతుంది’ అని కోహ్లి వివరించాడు.

మూడు మ్యాచ్‌ల ద్వారా టెస్టు ఫార్మాట్‌ అసలైన పోరాటం ఏంటో కూడా అర్థమవుతుందని, ఒక మ్యాచ్‌లో వెనుకబడినా... ఇంకో మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఇరుజట్లకూ ఉంటుందని, చివరకు అత్యుత్తమ జట్టే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)ని కైవసం చేసుకుంటుందని కోహ్లి విశ్లేషించాడు. తప్పులు సరిదిద్దుకునేందుకు, వ్యూహాలకు పదును పెట్టేందుకు బెస్టాఫ్‌ త్రీ ఫైనల్‌ సిరీస్‌ దోహదం చేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు.  అంతర్జా తీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఈ విషయంపై కసరత్తు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సిరీస్‌ సాకారమయ్యేందుకు కచ్చితంగా కృషి చేయాలని భారత కెప్టెన్‌ సూచించాడు. తాము ఓడినందుకే ఇలాంటి సూచనలు చేయడం లేదని సంప్రదాయ క్రికెట్‌కు సరైన ప్రామాణికతను తీసుకొచ్చేందుకే ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నట్లు చెప్పాడు.

మాకెందుకు బాధ
ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన దిగులు చెందాల్సిన పనిలేదని కోహ్లి అన్నాడు. ‘ఈ ఓటమిపై అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేం మూణ్నాలుగు ఏళ్లుగా ఓ టెస్టు జట్టుగా నాణ్యమైన ఆట ఆడుతూ వచ్చాం. ఈ ప్రయాణంలో గెలుపోటములే కాదు... ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకున్నాం. ఎదురైన సవాళ్లను ఎత్తుగడలతో అధిగమించాం. అలాంటి మా జట్టు కివీస్‌ చేతిలో... అదికూడా ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఇన్నాళ్లు మేం సాధించిందంతా దిగదుడుపేం కాదు. జట్టు సామర్థ్యాన్ని ఈ పరాజయం తక్కువ చేయనే చేయదు’ అని కోహ్లి అన్నాడు.

సమర్థమైన జట్టు కోసం...
సమర్థవంతమైన టెస్టు జట్టు కోసం సరైనోళ్లను జట్టులోకి తీసుకొస్తామని కోహ్లి చెప్పాడు. జట్టులో చెప్పుకోదగ్గ మార్పులుంటా యని నాయకుడు స్పష్టంగా చెప్పాడు. ‘జట్టు, ఆటతీరుపై సమీక్షించుకుంటాం. గడ్డు పరిస్థితు లెదురైనా... ఎలాంటి వాతావరణంలోనైనా, ఎంతటి క్లిష్ట బంతులయినా ఆడగలిగే జట్టుగా టీమిండియాను తయారు చేసుకుంటాం. ఇందుకోసం ఎక్కువ సమయం తీసుకోం. వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. పటిష్టమైన జట్టుగా మారుస్తాం. సంప్రదాయ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను, సరైన దృక్పథంతో ఆడగలిగే సమర్థులను జట్టులోకి తీసుకుంటాం’ అని అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top