BCCI: 'తెలియని దారుణాలు చాలానే.. బీసీసీఐ బయటపడనివ్వలేదు'

Vinod Rai: BCCI Use Mens Uniforms Cut-Up Restitched For Women Cricketers - Sakshi

బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా).. పేరుకు భారత క్రికెట్‌ బోర్డు అయినప్పటికి.. ఐసీసీనీ కూడా శాసించే స్థాయికి ఎదిగింది. క్రికెట్‌లో అత్యంత ధనికవంతమైన బోర్డుగా బీసీసీఐకి పేరుంది. పురుషుల క్రికెట్‌.. మహిళల క్రికెట్‌ను సమానంగా చూస్తూ ఆటగాళ్లకు తగిన హోదా కల్పిస్తున్నాయి. అయితే ఇవన్నీ బయటకు మాత్రమే. అంతర్లీనంగా బీసీసీఐలో కొన్నేళ్ల క్రితం జరిగిన దారుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం. బీసీసీఐలో మనకు తెలియని దారుణాలు ఏం చోటుచేసుకున్నయనేది మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వినోద్‌ రాయ్‌ వెల్లడించారు.

వినోద్‌ రాయ్‌ను సూప్రీంకోర్టు.. 2017-19 మధ్య బీసీసీఐ స్పెషల్‌ కమిటి అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బీసీసీఐలో ఎన్నికలు జరిగే వరకు వినోద్‌ రాయ్‌ సహా రామచంద్ర గుహ, విక్రమ్‌ లిమాయే, భారత మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీలతో నలుగురు సభ్యుల బృంధాన్ని ఏర్పాటు చేసి బోర్డు అడ్మినిస్ట్రేషన్‌ నడిపించారు. కాగా ఈ 33 ఏళ్ల కాలంలో వినోద్‌ రాయ్‌ బీసీసీఐలో జరిగిన లోటుపాట్ల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు. అయితే ఆయన ఏనాడు వాటిని బయటపెట్టలేదు.

తాజాగా వినోద్‌ రాయ్‌ ..''నాట్‌ జస్ట్‌ ఏ  నైట్‌ వాచ్‌మన్‌'' అనే బుక్‌ రాశారు. ఈ బుక్‌లో ముఖ్యంగా బీసీసీఐకి తాను అ‍డ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన కాలంలో జరిగిన అనుభవాలను, జ్ఞాపకాలను రాసుకొచ్చారు. అందులోనే అంతర్లీనంగా మహిళా క్రికెటర్లు ఎదుర్కొన్న వివక్ష గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని వినోద్‌ రాయ్‌ స్వయంగా ద వీక్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో వెల్లడించారు.

''బీసీసీఐ మహిళా క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. 2006 వరకు మహిళా క్రికెటర్లపై వివక్ష దారుణంగా ఉండేది. వాళ్లు మ్యాచ్‌లు ఆడేది తక్కువ సంఖ్య కాబట్టి.. కొత్త జెర్సీలు ఎందకన్న కారణంతో... పురుషుల వాడిన జెర్సీలనే కట్‌ చేసి మళ్లీ కుట్టి  వాటిని మహిళా క్రికెటర్లకు అందించేవారు. ఒక రకంగా వాడేసిన జెర్సీలను మహిళా క్రికెటర్లకు ఇచ్చారు. అయితే శరద్‌ పవార్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా వచ్చాకా.. పరిస్థితి కొంత నయమైంది.

ఆయన మెన్స్‌, వుమెన్స్‌ క్రికెట్‌ను ఒకే దగ్గరకు చేర్చాలనే కొత్త ఆలోచనతో వచ్చారు. దానివల్ల మహిళా క్రికెటర్ల బతుకులు చాలావరకు బాగుపడ్డాయి. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌(క్రికెటర్లకు జీతాలిచ్చే బోర్డు) అనేది రావడం వల్ల వివక్ష కాస్త తగ్గింది. కానీ ఇప్పటికి ఎక్కడో ఒక చోట అది కొనసాగుతూనే ఉంది. 2017లో నేనే బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నప్పుడు.. భారత మహిళల జట్టు 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ చేరింది.  ఆ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 171 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ టీమిండియాను ఫైనల్లో అడుగుపెట్టేలా చేసింది. అయితే ఇంత మంచి ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ ప్రీత్‌కౌర్‌కు మ్యాచ్‌కు ముందు సరైన ఫుడ్‌ ఇవ్వలేదంటే నమ్ముతారా.

ఆ విషయం హర్మన్‌ స్వయంగా చెప్పింది. 171 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ తర్వాత హర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడా.''సార్‌.. పరిగత్తడానికి శక్తి లేక బలాన్ని కుంచించుకొని సిక్స్‌లతోనే ఇన్నింగ్స్‌ ఆడాను. దానికి కారణం మాకు సరైన ఫుడ్‌ లేకపోవడమే. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మేమున్న హోటల్‌ సిబ్బంది.. ఈరోజు మీకు బ్రేక్‌ఫాస్ట్‌ ఏం లేదని.. సమోసాలతోనే సరిపెడుతున్నామని చెప్పారు. ఆ ఒ‍క్క సమోసాతోనే నా శక్తినంతా కుంగదీసుకొని ఇన్నింగ్స్‌ ఆడాను.'' అంటూ చెప్పుకొచ్చింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. బీసీసీఐ మహిళా క్రికెటర్లను సరైన దిశలో పట్టించుకోలేదని..

ఈ మధ్యకాలంలో నాకు తెలిసి పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లకు సరైన ట్రైనింగ్‌, కోచింగ్‌ అవసరాలు, ట్రావెల్‌ ఖర్చులు, క్రికెట్‌ కిట్‌, గేర్‌, చివరకు మ్యాచ్‌ ఫీజులు సక్రమంగా చెల్లిస్తే మరింత ముందుకెళ్లడం సాధ్యం. బీసీసీఐని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. అందులో ఉన్న లోపాలు మాత్రమే ఎత్తిచూపాను. ఇలాంటివి తొందరగా పరిష్కరించుకుంటే మేలు'' అంటూ ఆయన పేర్కొన్నారు.

చదవండి: ఐపీఎల్‌ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top