నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? చిన్నారి విన్యాసాలకు సచిన్‌ ఫిదా

Video Of Young Girl Playing Outrageous Shots Like Suryakumar Yadav Takes Internet By Storm - Sakshi

క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. ఈ వీడియోలో రాజస్థాన్‌కు చెందిన ముమల్‌ మెహర్‌ అనే ఓ బాలిక.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తరహా విధ్వంకర షాట్లతో విరుచుకుపడుతుంది. ముమల్‌ అచ్చం సూర్యకుమార్‌లా 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడుతుంది.

బౌలింగ్‌ చేస్తున్నది అబ్బాయి అయినా ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్‌లా నలుదిక్కులా షాట్లు ఆడి అందరి మనసులను దోచుకుంటుంది. ముమల్‌​ విన్యాసాలకు సంబంధించిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లేడీ స్కై అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే రాజస్థాన్‌లో ఏదో మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణగా తెలుస్తోంది.

ముమల్‌ విన్యాసాలకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఫిదా అయ్యాడు. సచిన్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? అంటూ కామెంట్‌ చేశాడు. అత్యద్భుతం.. ముమల్‌ బ్యాటింగ్‌ విన్యాసాలను నిజంగా ఎంజాయ్‌ చేశానంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

ముమల్‌ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ సైతం ట్విటర్‌లో షేర్‌ చేశారు. భవిష్యత్తులో ముమల్‌ టీమిండియా జెర్సీ ధరించే స్థాయికి ఎదిగేందుకు తోడ్పడాలని ఆమె రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ను అభ్యర్ధించారు. మొత్తంగా ముమల్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

ఇదిలా ఉంటే, ముంబై వేదికగా నిన్న (ఫిబ్రవరి 13) తొట్టతొలి మహిళల ఐపీఎల్‌ వేలం జరిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో చాలామంది భారత మహిళా క్రికెటర్లపై కనకవర్షం​ కురిసింది.

భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు సొం‍తం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్‌, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్‌, 2 కోట్లు), రిచా ఘోష్‌ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్‌ (ముంబై ఇండియన్స్‌, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (ముంబై ఇండియన్స్‌, 1.8 కోట్లు), రేణుకా సింగ్‌ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్‌, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top