Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ.. నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న క్రికెటర్లు

Top Sri Lanka Cricketers Back Anti Government Protests - Sakshi

Top Sri Lanka Cricketers Back Anti Government Protests: ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్లు, ఐపీఎల్‌ 2022 సీజన్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్‌ ఆటగాళ్లు, హెడ్ కోచ్‌లు గళం విప్పారు. తమ దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోవడానికి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కడానికి శ్రీలంక ప్రభుత్వ తీరే కారణమని వారు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. 

లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకుని ఈ దుర్భర పరిస్థితులకు కారణమయ్యారని ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్  మహేళ జయవర్దనే ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. లంకలో ఎమర్జెన్సీ విధించడం.. కఠినమైన కర్ఫ్యూ చట్టాలను అమలుచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని వాపోయాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం..  వారి బాగోగులను గాలికొదిలేసి, నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమని అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడుతున్న   న్యాయవాదులు, విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. 

జయవర్ధనేతో పాటు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర, పంజాబ్ కింగ్స్ ఆటగాడు భానుక రాజపక్సలు నిరసనకారులకు మద్దతు తెలిపారు. తాను భారత్‌లో ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ తన మనసంతా అక్కడే (శ్రీలంక) ఉందని రాజపక్స ఆవేదన వ్యక్తం చేయగా, నా దేశ ప్రజల దుస్థితి చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందంటూ సంగక్కర వాపోయాడు. సోమవారం కొలొంబోలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సంగక్కర భార్య యహేలి కూడా పాల్గొన్నారు.  కాగా, శ్రీలంకలో ఆర్థిక ఎమర్జెన్సీకి తోడు ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పడంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ. 190,  చక్కెర రూ. 240, పాల పౌడర్ రూ. 1,900, కోడి గుడ్డు రూ. 30 వరకు పలుకుతుంది. 
చదవండి: IPL 2022: ప్లే ఆఫ్స్‌కు లక్నో, గుజరాత్..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top