ఒక గిఫ్ట్‌గా ముంబై చేతిలో పెట్టారు: టామ్‌ మూడీ

Tom Moody Slams Delhi Capitals For Gifting Trent Boult - Sakshi

సిడ్నీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజయాల్లో పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌ ప్లేలో కానీ డెత్‌ ఓవర్లలో కానీ బౌల్ట్‌ తనదైన పేస్‌తో చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ జరిగిన క్వాలిఫయర్‌-1లో బౌల్ట్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు సాధించి తన బౌలింగ్‌ వేడిని రుచి చూపించాడు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా, అజింక్యా రహానేలను డకౌట్‌లుగా పంపి ఢిల్లీని కోలుకోని దెబ్బకొట్టాడు. కాగా, ఈ సీజన్‌లో బౌల్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ వదిలేయడం ఆ జట్టు చేసిన తప్పిదంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయపడ్డాడు. (ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌!)

ముంబైకు బౌల్ట్‌ను ఒక గిఫ్ట్‌గా ఢిల్లీ అప్పగించిందని విమర్శించాడు. ‘ అదొక అసాధారణమైన చర్య. ట్రేడింగ్‌ ద్వారా బౌల్ట్‌ను ముంబైకు వదిలేయడం సరైన నిర్ణయం కాదు. ప్రస్తుతం ముంబై జట్టులో బౌల్ట్‌ కీలక బౌలర్‌గా మారిపోయాడు. టోర్నమెంట్‌ యూఏఈలో జరుగుతుందని వారికి తెలియకపోవడంతోనే బౌల్ట్‌ను వదిలేసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా ముంబై దొరికిన ఒక గిఫ్ట్‌ బౌల్ట్‌. పవర్‌ ప్లేలో బౌల్ట్‌ ఒక అత్యుత్తమ బౌలర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. బలమైన జట్టుకు బౌల్ట్‌ను అప్పగించి తప్పుచేసింది ఢిల్లీ. ఒకవేళ ట్రేడింగ్‌ ద్వారా బౌల్ట్‌ ముంబైకు వెళ్లకపోతే అతని కోసం వేలంలో చాలా జట్లు పోటీ పడేవి. ఏది ఏమైనా బౌల్ట్‌ను వదిలేయడం ఢిల్లీ చేసిన అది పెద్ద తప్పు’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన మూడీ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్‌ ఆడాడు. తొలుత సన్‌రైజర్స్‌ తరుపున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ లెఫ్టార్మర్‌.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్‌ బౌల్ట్‌ జతకట్టాడు.  ట్రేడింగ్‌ విండో విధానం ఐపీఎల్‌-2015 నుంచి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రాంచైజీలు ఆటగాళ్లను బదిలీ చేసుకునే వీలు ఉంటుంది. (‘ఫినిషర్‌ అంటే అలా ఉండాలి’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top