Tokyo Olympics: చివరి రోజు 3 స్వర్ణాలు.. చైనాను వెనక్కి నెట్టి

Tokyo Olympics: US Beat China Tops With 113 Medals - Sakshi

113 పతకాలతో టాప్‌ ర్యాంక్‌

Tokyo Olympics: విశ్వ క్రీడల్లో మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్న అమెరికా టోక్యో ఒలింపిక్స్‌ను టాప్‌ ర్యాంక్‌తో ముగించింది. పోటీల చివరి రోజు వరకు అమెరికా స్వర్ణాల సంఖ్యలో చైనాకంటే రెండు పతకాలు వెనుకంజలో ఉంది. అయితే ఆఖరి రోజు అమెరికా మూడు పసిడి పతకాలు సాధించి చైనాను రెండో స్థానానికి నెట్టేసింది. మహిళల వాలీబాల్‌లో తొలిసారి అమెరికాకు బంగారు పతకం లభించింది. మహిళల బాస్కెట్‌బాల్‌లో అమెరికా జట్టు ఏడోసారి విజేతగా నిలిచింది. సైక్లింగ్‌ ఓమ్నియమ్‌ పాయింట్స్‌ రేసులో జెన్నిఫర్‌ వాలెంటి అమెరికాకు స్వర్ణాన్ని అందించింది. గత ఏడు ఒలింపిక్స్‌లో అమెరికా అగ్రస్థానంలో నిలవడం ఇది ఆరోసారి. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో చైనా తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితమైంది.

వాలీబాల్‌లో తొలిసారి...
వాలీబాల్‌ మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో అమెరికా 25–21, 25–20, 25–14తో బ్రెజిల్‌ మహిళల జట్టుపై గెలుపొంది తొలిసారి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. బాస్కెట్‌బాల్‌లోనూ అమెరికా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇప్పటికే పురుషుల విభాగంలో పసిడి పతకంతో నెగ్గిన అమెరికా... మహిళల విభాగంలోనూ మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో అమెరికా 90–75తో జపాన్‌పై ఘనవిజయం సాధించి స్వర్ణంతో మెరిసింది. తద్వారా వరుసగా ఏడోసారి (1996 నుంచి 2020) ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అమెరికా మహిళల జట్టు... పురుషుల టీమ్‌ సరసన నిలిచింది. 1936–1968 మధ్య జరిగిన ఏడు ఒలింపిక్స్‌ల్లోనూ అమెరికా పురుషుల జట్టు స్వర్ణాలు నెగ్గింది.
 

చదవండి: నీరజ్‌ చోప్రాకు ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్‌ భారీ నజరానా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top