Tokyo Olympics 2021: స్వర్ణం గెలవండి.. ఆరు కోట్లు పొందండి

Tokyo Olympics 2021: Odisha CM Announces Prize Money Of Rs 6 Crores For Gold Medal Winners From State - Sakshi

భువనేశ్వర్‌: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రోత్సహకాలు ప్రకటించారు. జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. బంగారు పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

ఈ నెల 23 నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున నగదు ఇస్తామని సీఎం నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అని, పతకం గెలవడం ద్వారా ఆ కల సాకారమవుతుందని అన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ద్యుతి చంద్‌, ప్రమోద్‌ భగత్‌, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్‌ రోహిదాస్‌లకు సీఎం అభినందనలు తెలిపారు.

ఇక టోక్యో ఒలింపిక్స్‌ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది. 14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్‌ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్‌ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్‌ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్‌లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్‌ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top