నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్‌ కెప్టెన్‌‌

Tim Paine Says Uncertainty Brisbane Test Source Comments Indian Side - Sakshi

సిడ్నీ: మ్యాచ్‌ ఎక్కడ నిర్వహిస్తారన్న అంశతో సంబంధం లేకుండా కేవలం ఆటపై దృష్టి సారించడం మాత్రమే తమ నైజమని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అన్నాడు. నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లో జరిగినా, ముంబైలో జరిగినా తమకు తేడా ఉండదని పేర్కొన్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో శక్తిమంతమైన బోర్డుగా వెలుగొందుతున్న బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న టిమ్‌ పైన్‌.. ప్రత్యర్థి జట్టు శిబిరం నుంచి వస్తున్న వార్తలు కాస్త గందరగోళానికి గురిచేస్తున్నాయన్నాడు. చివరి టెస్టు వేదిక ఎక్కడన్న విషయం గురించి తాము ఆలోచించడం లేదని, ప్రస్తుతం జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.(చదవండిచిత్తుగా ఓడిన పాక్‌: నంబర్‌ 1 జట్టుగా కివీస్‌)

 కాగా ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆసీస్‌- టీమిండియా మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్‌ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు స్పష్టంగా చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో  టిమ్‌ పైన్‌ మాట్లాడుతూ.. ప్రొటోకాల్‌ పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. (చదవండి: మళ్లీ ఆంక్షలా... మా వల్ల కాదు!)

‘‘సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇరు జట్లు వరుస సిరీస్‌లతో బిజీ అయ్యాయి. టెస్టు క్రికెట్‌ ఆడుతున్నాయి. రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవే. అంతేకాదు పరస్పర గౌరవంతో ముందుకు సాగుతాయి. అయితే కొన్ని రోజులుగా అవతలి వైపు శిబిరం నుంచి వినిపిస్తున్న మాటలు చిరాకైతే తెప్పించడం లేదు గానీ.. కాస్త అసాధారణంగా అనిపిన్నాయి. ఏదేమైనా మూడో టెస్టుపైనే ప్రస్తుతం మేం దృష్టి సారించాం’’ అని టిమ్‌ పైన్‌ చెప్పుకొచ్చాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top