విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో హైదరాబాద్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టాడు. రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఓపెనర్లు అమన్ రావ్(13), తన్మయ్ అగర్వాల్(16) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు.తొలుత ఆచి తూచి ఆడిన వర్మ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అభిరత్ రెడ్డి (71) తో కలిసి 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. చండీగఢ్ బౌలర్లలో జగజీత్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ దండా,హర్తేజస్వి కపూర్, విశూ కశ్యప్ తలా రెండు వికెట్లు సాధించారు.
కివీస్‌తో వన్డేలకు తిలక్‌కు చోటిస్తారా?
కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తిలక్ భారత జట్టులో భాగమైనప్పటికి.. ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి రానుండడంతో అతడిపై వేటు పడే అవకాశముంది.
మరోవైపు కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ కూడా సెంచరీలో మోత మోగిస్తున్నాడు. అతడు కూడా సెలక్టర్లు దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్‌లో ‘తొలి’ సెంచరీ!


