ఆసియా క్రీడలు-2026 పురుషుల క్రికెట్ టోర్నీ విజేతగా భారత జట్టు నిలిచింది. శనివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. వరుసగా రెండో సారి పసిడి పతకాన్ని ముద్దాడింది. అయితే ఈ చారిత్రత్మక విజయంలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మది కీలక పాత్ర. 23 ఏళ్ల తిలక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి హీరోగా నిలిచాడు.
విమర్శకుల నోళ్లు మూయించిన తిలక్
ఇటీవలి కాలంలో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు తిలక్ వర్మ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన తిలక్.. తొలి 11 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సమయంలో టీమిండియా 200 పరుగుల స్కోరునైనా అందుకోగలదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఆ తర్వాత తిలక్ వర్మ తన అసలు రూపం చూపించాడు. చివరి 3 ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్లను ఉతికారేస్తూ ఏకంగా 38 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ముగింపుతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.
మలుపు తిప్పిన తిలక్ ఇన్నింగ్స్
పాకిస్తాన్ ఛేజింగ్‌లో చివరివరకు పోరాడి 20 ఓవర్లలో 192 పరుగులు చేసి ఓటమి పాలైంది. పాక్ తమ విజయానికి కేవలం 19 పరుగుల దూరంలో ఆగిపోయింది. అయితే తిలక్ చివరి ఓవర్లలో సాధించిన ఆ కీలక పరుగులే భారత్‌కు స్వర్ణ పతకాన్ని తెచ్చి పెట్టాయి. ఒకవేళ తిలక్ దూకుడుగా పరుగులు సాధించపోయింటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
పాక్ అంటే పూనకాలే
కాగా హైదరాబాదీ తిలక్ వర్మకు పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే పూనకాలే. గతేడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో కూడా తిలక్ (69 నాటౌట్) ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించాడు. ఇప్పుడు ఆసియా క్రీడల ఫైనల్లోనూ మరోసారి మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు.


