Photo Credit: BCCI Twitter
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (129 నాటౌట్) విధ్వంసకర సెంచరీకి తోడు రోహిత్ శర్మ (92) రాణించడంతో భారత జట్టు 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్‌లో టీమిండియా అరుదైన రికార్డు నెలకొల్పింది. వన్డే చరిత్రలో టీమిండియా 350 ప్లస్ స్కోరు సాధించడం ఇది 45వ సారి.
సౌతాఫ్రికా 36 సార్లు 350 ప్లస్ స్కోర్లు సాధించి రెండో స్థానంలో ఉండగా, తొలి స్థానంలో ఉన్న భారత్‌కు.. రెండో ప్లేస్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు మధ్య 11 వ్యత్యాసముంది. దీంతో భారత జట్టు ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతుంది. ఇక భారత్, ఆస్ట్రేలియా తర్వాత ఆస్ట్రేలియా 31సార్లు 350 ప్లస్ స్కోర్లు చేయగా, ఇంగ్లండ్ 29 సార్లు, న్యూజిలాండ్ 18 సార్లు చొప్పున వన్డేల్లో 350 ప్లస్ స్కోరు చేశాయి.
దీంతోపాటు టీమిండియా మరో రికార్డు కూడా సాధించింది. విండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి 45 సిక్సర్లు కొట్టారు. తద్వారా ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో టీమిండియా ఇంగ్లండ్‌తో కలిపి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతుంది.
భారత్, ఇంగ్లండ్ కంటే ముందు ఆస్ట్రేలియా (66 సిక్సర్లు వర్సెస్ టీమిండియా, 2013లో), వెస్టిండీస్ (66 సిక్సర్లు వర్సెస్ ఇంగ్లండ్, 2019లో) సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక సౌతాఫ్రికా (55 సిక్సర్లు వర్సెస్ ఆస్ట్రేలియా, 2023లో) రెండో స్థానంలో కొనసాగుతుంది.
ఇదీ చదవండి: రాహుల్ సెంచరీ, దంచికొట్టిన రోహిత్.. విండీస్ టార్గెట్ 352 రన్స్


