టీమిండియా మెడలో స్వర్ణాలు.. పాక్‌ ఆటగాళ్లకు మెడల్స్‌ ఇవ్వని జై షా | Asian Games 2026, Jay Shah Hands Gold Medals to India, Skips Presenting Silver Medals to Pak, Draws Attention, Watch Video Inside | Sakshi
Sakshi News home page

టీమిండియా మెడలో స్వర్ణాలు.. పాక్‌ ఆటగాళ్లకు మెడల్స్‌ ఇవ్వని జై షా

Oct 3 2026 3:51 PM | Updated on Oct 3 2026 4:16 PM

Jay Shah Handing Gold Medal To India Skips Giving Silver To Pakistan

PC: Sonysports X

ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా మరోసారి సత్తా చాటింది. జపాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో శనివారం నాటి ఫైనల్లో 19 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

ఈ విజయంలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 61), వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్‌), ఆల్‌రౌండర్‌ శివం దూబే (15 బంతుల్లో 27) కీలక పాత్ర పోషించారు. ఇక చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చైర్మన్‌ జై షా బంగారు పతకాలను ప్రదానం చేశారు.

ప్రతీ ఆటగాడి మెడలో స్వర్ణ పతకం
నిజానికి ఆసియా క్రికెట్‌ మండలి (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌, పాక్‌ మంత్రి మోసిన్‌ నక్వీ మెడల్‌ అందించేందుకు వస్తారనే ప్రచారం జరిగింది. అయితే, నక్వీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో జై షా టీమిండియాలోని ప్రతీ ఆటగాడి మెడలో స్వర్ణ పతకం వేశారు.

అయితే, పాకిస్తాన్‌ ఆటగాళ్లకు రజత పతకాలు అందించేందుకు మాత్రం జై షా నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌కు వేదికైన నిశిన్‌ సిటీ మేయర్‌ పాక్‌ జట్టుకు వెండి పతకాలు అందజేశారు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సీఈఓ సల్మాన్‌ నాజర్‌.. ఆటగాళ్లకు మస్కట్‌ అందించారు. మరోవైపు.. కాంస్యం గెలిచిన శ్రీలంక జట్టుకు శ్రీలంక ఒలింపిక్‌ కమిటీ ఉపాధ్యక్షుడు పతకాలు ప్రదానం చేశారు. 

నాటి నుంచి.. నేటి దాకా
కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన టోర్నీల్లోనూ పాక్‌ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనాన్ని నిరాకరిస్తూ వస్తోంది.

తీరు మారని నక్వీ
తాజాగా శనివారం కూడా ఇదే ఘటన మరోసారి పునరావృతమైంది. ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్‌-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ఏసీసీ అధ్యక్షుడు నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్వీ ట్రోఫీని తనతో పాటే తీసుకువెళ్లి ఇంత వరకు టీమిండియాకు అందనివ్వలేదు.

ఇదే తేడా
ఇటీవల ఆసియా కప్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు విషయంలోనూ ఇదే జరిగింది. అయితే, ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన జై షా.. పాక్‌ ఆటగాళ్లకు పతకాలు అందజేయడానికి నిరాకరించినప్పటికీ.. వారికి మెడల్స్‌ అందేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘పాకిస్తాన్‌కు భారత్‌కు ఉన్న తేడా ఇదే’ అంటూ నక్వీ తీరును మరోసారి ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement