PC: TG20 League X
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్‌తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.
తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకం
కరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్‌లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Simply outstanding! 🤩
A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥
What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026
మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.
గెలుపు ఆశలపై నీళ్లు
ఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు.
శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.
కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఇదే తొలి గెలుపు.
తుదిజట్లు
కరీంనగర్ డైమండ్స్
సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్
వరంగల్ వారియర్స్
హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.


