తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20) ద్వారా స్థానిక ఆటగాళ్లకు చక్కటి వేదిక దొరికిందని కరీంనగర్ డైమండ్స్ కోచ్ సుమంత్ కొల్లా అన్నారు. తమ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నారని.. వారు తప్పక రాణిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ డైమండ్స్ జట్టు గురువారం సాక్షి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కోచ్ సుమంత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం, ప్రత్యర్థిని బట్టి మా వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాము.
అందుకు అనుగుణంగానే జట్టు కూర్పు కూడా ఉంటుంది. ఏదేమైనా ప్రతీ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదం పంచేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా ఆఖరి వరకు మేము పోరాడతాము. మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెంట నిలిచే అభిమానులను గర్వపడేలా చేయడమే మా లక్ష్యం.

ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు
హైదరాబాద్ ఇ- చాంపియన్స్ జట్టును ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నాము. ఆ జట్టుతో మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడతాము. ఇక తిలక్ వర్మ (మెదక్ ఫాల్కన్స్), మహ్మద్ సిరాజ్ (వరంగల్ వారియర్స్) వంటి టీమిండియా స్టార్లపై ఆడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వాళ్లతో పోటీని కూడా మా వాళ్లు పూర్తిగా ఆస్వాదిస్తూ.. సత్తా చాటగలరనే నమ్మకం ఉంది’’ అని సుమంత్ పేర్కొన్నారు.
ఇక కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘అభిమానుల మద్దతు మాకు చాలా అవసరం. నా భార్య కూడా స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూస్తుంది. కుటుంబం నుంచి ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. అయితే, మైదానంలో దిగిన తర్వాత మాత్రం దృష్టి మొత్తం ఆట మీదే ఉంటుంది.
మేము మా యాజమాన్యం పట్ల కృతజ్ఞులమై ఉంటాము. మ్యాచ్ ఓడినా.. గెలిచినా... నా సహచర ఆటగాళ్ల పట్ల నాకు కృతజ్ఞతాభావం ఉంటుంది. మేమంతా కలిస్తే జట్టు. కాబట్టి గెలుపోటములలో అందరికీ సమాన భాగం ఉంటుంది’’ అని తెలిపాడు

డ్రెసింగ్‌రూమ్ వాతావరణం
అదే విధంగా.. ‘‘మ్యాచ్‌కు ముందు ఒత్తిడి ఉండటం సహజం. అప్పుడు మా టీమ్‌మేట్ ఆశిష్ శ్రీవాస్తవ్ మమ్మల్ని కూల్ చేస్తాడు (నవ్వులు). ఇక మా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. కాబట్టి మా జట్టు ఛేజింగ్‌లో మరింత గొప్పగా రాణించగలదని చెప్పగలను. మా ఆల్‌రౌండర్ హరీశ్ ఠాకూర్ ఏడో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేయగలడు.
గత మ్యాచ్‌లో కూడా మేము బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ 8-9 తొమ్మిది బంతుల్లో వరుసగా వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆటలో ఇవన్నీ సహజం. మేము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాము. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నా.
ఇక కెప్టెన్‌గా జట్టును సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించడం అత్యంత ముఖ్యం. గత పదిహేనేళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నా. మా జట్టు సభ్యుల సందేహాలు తీర్చడం, ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా వ్యూహాలు మార్చడం నా విధి.
అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే నా లక్ష్యం. యాజమాన్యం మాపై ఒత్తిడి పెట్టదు. టీజీ20 ద్వారా మాకు మంచి ప్లామ్‌ఫామ్ దొరికింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని తన్మయ్ అగర్వాల్ పేర్కొన్నాడు.
చదవండి: కరీంనగర్‌పై నల్గొండ గెలుపు


