శ్రీజ ‘డబుల్‌’ ధమాకా

Telangana Sreeja Akula crowned as National Table Tennis - Sakshi

జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్, డబుల్స్‌ టైటిల్స్‌ సొంతం

ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత

షిల్లాంగ్‌ (మేఘాలయ): కొన్నేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ అందని ద్రాక్షగా ఉన్న జాతీయ సీనియర్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఎట్టకేలకు అందుకుంది. అంతేకాకుండా మహిళల డబుల్స్‌ విభాగంలోనూ విజేతగా నిలిచి ‘డబుల్‌’ సాధించింది. గత ఏడాది సింగిల్స్‌లో కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ 23 ఏళ్ల శ్రీజ ఈసారి చాంపియన్‌గా అవతరించింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) హైదరాబాద్‌ బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీజ ఈ మెగా ఈవెంట్‌లో ఆర్‌బీఐ తరఫున బరిలోకి దిగింది. సోమవారం సాయంత్రం జరిగిన సింగిల్స్‌ ఫైనల్లో ఆకుల శ్రీజ 11–8, 11–13, 12–10, 11–8, 11–6తో భారత సీనియర్‌ స్టార్‌ ప్లేయర్, మౌమా దాస్‌పై విజయం సాధించింది. బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల మౌమా దాస్‌ ఐదుసార్లు జాతీయ సింగిల్స్‌ చాంపియన్‌గా నిలువడంతోపాటు అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ భారత, ఆసియా ప్లేయర్‌గా గుర్తింపు పొంది ంది.

సెమీఫైనల్లో శ్రీజ 12–10, 8–11, 11–8, 11–9, 3–11, 12–10తో అహిక ముఖర్జీ (ఆర్‌బీఐ) పై నెగ్గింది. అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–అహిక ముఖర్జీ (ఆర్‌బీఐ) ద్వయం 3–11, 11–9, 11–5, 12–10తో రైల్వేస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు చెందిన టకేమి సర్కార్‌–ప్రాప్తి సేన్‌ జోడీపై గెలిచింది.  

తాజా విజయంతో శ్రీజ జాతీయ సీనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తొలి తెలంగాణ ప్లేయర్‌గా ఘనత వహించింది. గతంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్‌ సుల్తానా ఆరుసార్లు (1949, 1950, 1951, 1952, 1953, 1955) జాతీయ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచింది. అయితే సుల్తానా కుటుంబం 1956లో హైదరాబాద్‌ నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిర పడింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరా బాద్‌కు చెందిన మీర్‌ ఖాసిమ్‌ అలీ రెండుసార్లు (1968, 1969) చాంపియన్‌గా నిలిచారు.
       
నా కల నిజమైంది...
గతంలో మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో జాతీయ టైటిల్స్‌ సాధించాను. కానీ సింగిల్స్‌ విభాగంలో తొలిసారి జాతీయ చాంపియన్‌ కావడంతో నా చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా విజయం త్వరలో మొదలయ్యే అంతర్జాతీయ సీజన్‌ లో మరింత మెరుగ్గా రాణించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.          
–‘సాక్షి’తో ఆకుల శ్రీజ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top