Virat Kohli On India Loss: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం..

T20 World Cup 2021 Ind Vs Nz: Virat Kohli Comments On Lost Match To NZ - Sakshi

T20 World Cup 2021 Ind Vs Nz- Virat Kohli Comments On Lost Match To NZ: కీలక మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. 8 వికెట్ల తేడాతో ఓటమి పాలై ఘోర పరాభవం మూటగట్టుకుంది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో సెమీస్‌ చేరే మార్గాలను మరింత కఠినతరం చేసుకుంది. దుబాయ్‌ వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కోహ్లి సేన తొలుత బ్యాటింగ్‌ చేసి.. నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసింది.

ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(18), ఇషాన్‌ కిషన్‌(4) సహా వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్‌ శర్మ(14) సహా మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్‌ కోహ్లి(9) పూర్తిగా నిరాశపరిచాడు. రవీంద్ర జడేజా చేసిన 26 పరుగులే భారత్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరు. ఇక బౌలింగ్‌ విభాగంలో అదరగొట్టిన విలియమ్సన్‌ బృందం... స్వల్ప లక్ష్య ఛేదనలో భాగంగా 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. ఇష్‌ సోధి(2 వికెట్లు) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి... బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఆశించిన మేర రాణించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మైదానంలో అడుగుపెట్టినపుడు న్యూజిలాండ్‌ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ చూస్తే వాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కానీ మా పరిస్థితి అలా లేదు. అవకాశం దొరికిందనుకున్న ప్రతిసారి వికెట్‌ కోల్పోయాం. షాట్‌ ఆడదామా లేదా అన్న సందిగ్దంలో పడి భారీ మూల్యం చెల్లించుకున్నాం.

భారత్‌ తరఫున ఆడుతున్నపుడు భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఎంతో మంది మమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా మంది మా కోసం మైదానానికి కూడా వస్తారు. ఈ అంచనాలకు అనుగుణంగా ఇండియాకు ఆడుతున్న ప్రతీ ఆటగాడు తనను తాను మలచుకోవాలి.  కానీ కీలకమైన రెండు మ్యాచ్‌లలో మేమలా చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం. అయితే సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ ఆశావాదంతో ఉండాలి.

ఒత్తిడిని జయించి.. ముందుకు వెళ్లాలి. ఈ టోర్నమెంట్‌లో ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని అధిగమించలేక ప్రత్యర్థి జట్టు ముందు తలొంచాల్సి వచ్చిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక అఫ్గనిస్తాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాతో భారత్‌ తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది.

చదవండి: దారుణ ఆటతీరు.. టీమిండియా చెత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top