SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్‌

Sunrisers Eastern Cape Wins First SA20 Title By Beating Pretoria Capitals - Sakshi

మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఇనాగురల్‌ ఎడిషన్‌ టైటిల్‌ను సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ టీమ్‌ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొం‍దింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్‌.. 19.3 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.

వాన్‌ డెర్‌ మెర్వ్‌ 4, మగాలా, బార్ట్‌మన్‌ తలో 2 వికెట్లు, జన్సెన్‌, మార్క్రమ్‌ చెరో వికెట్‌ పడగొట్టి ప్రిటోరియాను దారుణంగా దెబ్బకొట్టారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో కుశాల్‌ మెండిస్‌ (21) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌.. 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ ఆడమ్‌ రొస్సింగ్టన్‌ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, హెర్మన్‌ (22), కెప్టెన్‌ మార్క్రమ్‌ (26), జన్సెస్‌ (13 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రిటోరియా బౌలర్లలో నోర్జే 2, ఈథన్‌ బోష్‌, ఆదిల్‌ రషీద్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, జేమ్స్‌ నీషమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఐపీఎల్‌ జట్టైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాని కావ్య మారన్‌.. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా సత్తా చాటలేకపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఎట్టకేలకు మినీ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంది. సన్‌రైజర్స్‌ టైటిల్‌ గెలవడంతో ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ అయ్యిందంటూ ఫ్రాంచైజీ అభిమానులు చర్చించుకుంటున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top