భువీ స్థానంలో పృథ్వీ రాజ్‌ యర్రా

SRH Name Prithvi Yarra As Bhuvneshwars Replacement - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయాలు వేధిస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడి టోర్నీ మొత్తానికి దూరమైతే, ఇంకా సగం లీగ్‌ కూడా పూర్తి కాకుండానే మరొక పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తుంటి గాయంతో వైదొలిగాడు. భువీ తిరిగి కోలుకోవడానికి కనీసం ఆరువారాల సమయం పట్టే అవకాశం ఉండటంతో టోర్నీకి దూరం కాకతప్పలేదు. అయితే మార్ష్‌ స్థానంలో జేసన్‌ హోల్డర్‌ను హైదరాబాద్‌ బ్యాకప్‌గా తీసుకోగా, భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో ఆంధ్రాకు చెందిన లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌ పృథ్వీ రాజ్‌ యర్రాను జట్టులోకి తీసుకుంది. గత ఐపీఎల్‌ సీజన్‌లో పృథ్వీరాజ్‌ యర్రా కేకేఆర్‌కు ఆడాడు. కేకేఆర్‌ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పృథ్వీరాజ్‌.. ఈ సీజన్‌లో ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. గత ఐపీఎల్‌ కోసం పృథ్వీరాజ్‌ను రూ. 20లక్షలకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. (చదవండి:ఇలా అయితే కష్టం పృథ్వీషా!)

పృథ్వీ ఖాతాలో వార్నర్‌ వికెట్‌..
గతేడాది కేకేఆర్‌ తరఫున ఆడిన పృథ్వీ రాజ్‌.. రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం ఒక వికెట్‌ తీశాడు. అది కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ వికెట్‌ కావడం విశేషం. ఇప్పుడు అదే పృథ్వీరాజ్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడబోతున్నాడు. గతేడాది కేకేఆర్‌కు ఆడే వరకూ ట్వంటీ20 క్రికెట్‌ ఆడని పృథ్వీ.. నేరుగా ఐపీఎల్‌లో అడుగుపెట్టడం మరొక విశేషం. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ 39 వికెట్లు సాధించాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన 22 ఏళ్ల పృథ్వీ రాజ్‌.. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 21. 51 యావరేజ్‌ కల్గి ఉన్నాడు. ఇక లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 

భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో పృథ్వీ రాజ్‌ ఆడబోతున్న విషయాన్ని ఎస్‌ఆర్‌హెచ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో తెలిపింది.  ఈ సీజన్‌కు భువీ దూరమయ్యాడనే విషయాన్ని తెలిపిన ఆరెంజ్‌ఆర్మీ.. పృథ్వీ రాజ్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. (చదవండి: ఎంఎస్‌ ధోని ఫన్నీ వాక్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top