
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 236 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. 456 రన్స్ లోటుతో ఫాలో ఆన్ ఆడిన ఆతిథ్య జింబాబ్వే.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు కుప్పకూలింది.
సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లు పడగొట్టగా.. సేనురన్ ముత్తుసామి మూడు, కోడీ యూసఫ్ రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో నిక్ వెల్చ్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్రెయిగ్ ఎర్విన్(49), కైతానో(40) పర్వాలేదన్పించారు.
ముల్డర్ ట్రిపుల్ సెంచరీ..
అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 626/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు)చెలరేగాడు.
అతడితో పాటు డేవిడ్ బెడింగ్హమ్ (82), లుహాన్ డ్రి ప్రిటోరియస్ (78), డెవాల్డ్ బ్రెవిస్ (30), వెర్రిన్ (42) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. ప్రోటీస్ బౌలర్లలో సుబ్రేయన్ నాలుగు.. ముల్డర్, యూసఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా జింబాబ్వే ఫాలో ఆన్ ఆడింది. ఫాల్ ఆన్‌లో కూడా విఫలం కావడంతో ఆతిథ్య జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ రెండు అవార్డులు కూడా ముల్డర్‌కే దక్కాయి.
చదవండి: లారా ఒక్కడి మీదే గౌరవమా?.. అతడిది నిజంగా నిస్వార్థమేనా?